సెలవులకు కొత్త ‘థీమ్‌’! | special story on theam parks | Sakshi
Sakshi News home page

సెలవులకు కొత్త ‘థీమ్‌’!

Published Sat, Apr 8 2017 12:46 AM | Last Updated on Tue, Sep 5 2017 8:11 AM

సెలవులకు కొత్త ‘థీమ్‌’!

సెలవులకు కొత్త ‘థీమ్‌’!

దేశంలో థీమ్‌ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..
గతేడాది అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ల ఆదాయం రూ. 2,930 కోట్లు!
ఏటా 5 కోట్ల మంది సందర్శన; 10–15 శాతం వృద్ధి
వచ్చే మూడేళ్లలో రూ.4వేల కోట్ల ఆదాయంపై దృష్టి
హైదరాబాద్‌లో డిస్నీల్యాండ్, యాడ్‌ల్యాబ్స్‌ ఇమాజికా?  


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో
రోలర్‌ కోస్టర్, ఫ్లై థీమ్‌ స్పేస్, ఫ్లాట్‌ రైడ్స్, ఫెర్సీస్‌ వీల్స్, వెట్‌–ఓ–వైల్డ్, డ్రాప్‌ టవర్‌... ఇవి హాలీవుడ్‌ సినిమా పేర్లనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇవన్నీ వినోదభరిత క్రీడల పేర్లు. గతేడాది ఈ క్రీడలపై పెట్టిన ఖర్చు ఏకంగా రూ.2,930 కోట్లు! సినిమా అయితే రెండున్నర గంటల్లో పూర్తవుతుంది. ఇవి మాత్రం రోజంతా... ఇంకా చెప్పాలంటే మళ్లీ మళ్లీ వెళ్లాలనిపించే ప్రాంతాలు. ఈ అమ్యూజ్‌మెంట్, థీమ్‌ పార్క్‌లు వినోద, ఆహ్లాదభరితమైన ప్రాంతాలే కాదు.. కాసులు కురిపించే భారీ పరిశ్రమలు కూడా!!.

రూ.2,930 కోట్లకు పరిశ్రమ..
ప్రపంచవ్యాప్తంగా అమ్యూజ్‌మెంట్, థీమ్‌ పార్క్‌ పరిశ్రమ విలువ రూ.2.7 లక్షల కోట్లుగా ఉంది. మన దేశంలో 2015లో రూ.2,660 కోట్లుకు చేరిన పరిశ్రమ 2016 నాటికి రూ.2,930 కోట్లకు వృద్ధి చెందినట్లు ‘ది ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌‘  (ఐఏఏపీఐ) చెబుతోంది. వచ్చే మూడేళ్లలో ఏటా 17.5 శాతం వృద్ధితో రూ.4 వేల కోట్లను అధిగమిస్తుందని పేర్కొంది. ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 80 వేల మంది, పరోక్షంగా 1.5 లక్షల మంది ఉపాధిని పొందుతున్నారు.

ఏటా 5 కోట్ల మంది సందర్శన..
ప్రస్తుతం దేశంలో 125 అమ్యూజ్‌మెంట్, థీమ్‌ పార్క్‌లున్నాయి. యాడ్‌ల్యాబ్స్‌ ఇమాజికా, ఎస్సెల్‌ వరల్డ్, నిక్కో పార్క్, వండర్‌లా, కిష్కింద వంటివి బాగా ప్రసిద్ధి చెందాయి. శరవేగంగా జరుగుతున్న నగరీకరణ, చిన్న కుటుంబాలు, మిగులు ఆదాయం వంటివి అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ల సందర్శకుల్లో వృద్ధికి కారణమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఏటా దేశంలో 5 కోట్ల మంది పార్క్‌లను ఈ సందర్శిస్తున్నారని.. ఏటా 10–15 శాతం వృద్ధి నమోదవుతోందని వండర్‌లా హాలిడేస్‌ లిమిటెడ్‌ ఎండీ అరుణ్‌ కె చిట్టిలపిల్లి చెప్పారు. పరిశ్రమకు 55 శాతం ఆదాయం టికెట్ల అమ్మకాల ద్వారా, 35 శాతం ఆదాయం ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్‌ (ఎఫ్‌అండ్‌బీ), మిగిలింది బ్రాండింగ్‌ ద్వారా వస్తోంది.

ద్వంద్వ పన్నులే అడ్డు..
ప్రస్తుతం అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ పరిశ్రమ ఎంటర్‌టైన్‌మెంట్‌ ట్యాక్స్, సర్వీస్‌ ట్యాక్స్‌లు రెండింటినీ చెల్లించాల్సి వస్తోంది. మలేíసియా, థాయ్‌ల్యాండ్, సింగపూర్, చైనా, జపాన్‌ వంటి దేశాల్లో ఈ పరిశ్రమకు పన్నులు 10 శాతం కంటే తక్కువుంటాయి. మన దేశంలో మాత్రం 25–50 శాతం వరకు చెల్లించాల్సి వస్తోంది. ఈ ద్వంద్వ పన్ను విధానమే పరిశ్రమ వృద్ధికి అడ్డుగా మారుతోందని ఐఏఏపీఐ జనరల్‌ సెక్రటరీ అనిల్‌ పద్వాల్‌ తెలిపారు. వాస్తవానికి అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ పరిశ్రమ పర్యాటక రంగంలో భాగం. ఆయా పార్క్‌లతో విదేశీ పర్యాటకులు మన దేశానికొస్తున్నారు. ఏటా టూరిజం వృద్ధి చెందుతోంది కూడా.

అమ్యూజ్‌మెంట్‌ పార్కుల ఏర్పాటుకు ప్రధానంగా కావాల్సింది భూమి, యంత్ర సామాగ్రి, జల వనరులు, రవాణా సౌకర్యం. ప్రధాన నగరాల్లో భూముల విలువలు పెరగడం, పూర్తిగా యంత్ర సామగ్రిపై ఆధారపడటంతో పార్క్‌ల ఏర్పాటు ప్రారంభ పెట్టుబడులు అధికంగా ఉంటాయని అందుకే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు స్థల కేటాయింపులు, పన్ను ప్రోత్సాహకాలు కల్పించాలని ఆయన కోరారు. త్వరలో అమలులోకి రానున్న వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)తో ఈ రంగంలో పారదర్శకత నెలకొని, పెట్టుబడులు మరింత వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

నిర్మాణంలో మరో 12 పార్క్‌లు..
వచ్చే ఐదేళ్లలో దేశంలో కొత్తగా మరో 12 అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌లు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. వండర్‌లా, అట్లాంటా, ల్యాండ్‌మార్క్‌ వంటి కంపెనీలు స్థల సమీకరణ పూర్తి చేసి పార్క్‌ నిర్మాణ పనులు జరుపుతుంటే.. డిస్నీల్యాండ్, య్యాడ్‌ల్యాబ్స్‌ ఇమాజికా వంటి సంస్థలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రాథమిక చర్చల్లో ఉన్నాయి.

హైదరాబాద్‌లో డిస్నీల్యాండ్‌..
ప్రస్తుతం హైదరాబాద్‌లో వండర్‌లా, ఓషన్‌ వరల్డ్, మౌంట్‌ ఓపెరా వంటి అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌లున్నాయి. ఏటా వీటిని 10 లక్షల మంది సందర్శిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కొత్తగా నగరంలో యాడ్‌ల్యాబ్స్‌ ఇమాజికా, డిస్నీల్యాండ్‌ సంస్థలు థీమ్‌ పార్క్‌లు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి. రూ.25 వేల కోట్లతో 1,300 ఎకరాల్లో డిస్నీ థీమ్‌పార్క్‌ను ఏర్పాటు చేయాలనుకుంటోంది. స్థల సమీకరణ కోసం రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలను పరిశీలిస్తోంది. యాడ్‌ల్యాబ్స్‌ ఇమాజికా నగర శివారులో స్థల సమీకరణ కూడా పూర్తి చేసిందని.. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభించనుందని తెలిసింది.

భలే పార్క్‌లు, బోలెడన్ని రైడ్లు
వండర్‌లా హాలిడేస్‌ లిమిటెడ్‌కు కొచ్చి, బెంగళూరు, హైదరాబాద్‌లో అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌లున్నాయి. 35 ఎకరాల్లోని కొచ్చి పార్క్‌లో 58 రైడ్స్, 82 ఎకరాల్లోని బెంగళూరు పార్క్‌లో 62 రైడ్స్, 50 ఎకరాల్లోని హైదరాబాద్‌ పార్క్‌లో 43 రైడ్స్‌ ఉన్నాయి. ఏటా వీటిని 26 లక్షల మంది సందర్శిస్తున్నారు.
ఎస్సెల్‌ గ్రూప్‌ పాన్‌ ఇండియా పర్యాటన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (పీఐపీపీఎల్‌) పేరుతో అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌లను నిర్వహిస్తోంది. ఈ సంస్థకు ముంబైలో 64 ఎకరాల్లో ఎస్సెల్‌ వర ల్డ్, 22 ఎకరాల్లో వాటర్‌ కింగ్‌డమ్‌ థీమ్‌ పార్క్‌లున్నాయి. ఎస్సెల్‌ వరల్డ్‌లో 90 రైడ్స్‌ ఉన్నాయి. ఏటా 18 లక్షల మంది సందర్శిస్తున్నారు. వాటర్‌ కింగ్‌ డమ్‌లో 30 రైడ్స్‌ ఉన్నాయి. దీన్ని ఏటా 11 లక్షల మంది సందర్శిస్తున్నారు.
నిక్కో పార్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌పీఆర్‌ఎల్‌) కోల్‌కతాలో నికోపార్క్‌ను నిర్వహిస్తోంది. 40 ఎకరాల్లో ఉన్న ఈ పార్క్‌లో 35 రకాల రైడ్స్‌ ఉన్నాయి. ఏటా 15 లక్షల మంది విజిట్‌ చేస్తున్నారు.
మహారాష్ట్ర రాయ్‌ఘడ్‌లోని ఖోపొలి ప్రాంతంలో 300 ఎకరాల్లో యాడ్‌ల్యాబ్స్‌ ఇమాజికా థీమ్‌ పార్క్‌ ఉంది. ఇందులో థీమ్, వాటర్, స్నో పార్క్‌ మూడు కలిపి ఉండటం దీని ప్రత్యేకత. ఏటా ఈ పార్క్‌ను 12 లక్షల మంది సందర్శిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement