ఇలాంటి నౌకను ఇప్పటి వరకు చూసి ఉండరు. దీన్ని ఏకంగా 24 కేరెట్ల బంగారంతో తయారు చేశారు. ప్రయాణించాలంటే మాత్రం కోట్లు వెచ్చించాల్సి ఉంటుందట. దీన్ని ఎవరూ తయారు చేశారు? ఎక్కడుందంటే..
దూరం నుంచి చూడగానే బంగారు ధగధగలతో మిరుమిట్లు గొలిపే ఈ నౌకకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి బంగారునౌక. నౌక వెలుపలి వైపు పూర్తిగా 24 కేరెట్ల బంగారు రేకుతో తాపడం చేశారు. నౌక లోపల కూడా గదుల్లోని ఫర్నిచర్ హ్యాండిల్స్, నాబ్స్, షాండ్లియర్స్, గ్లాస్ ఫ్రేమ్స్ వంటివాటిని కూడా పూర్తిగా బంగారు తాపడంతో తయారు చేశారు. దీని యజమాని ఆస్ట్రేలియన్ కంపెనీ ఏకే రాయల్టీ అధినేత ఆరన్ ఫిడ్లర్.
ఇందులో సిబ్బందితో పాటు మరో పన్నెండుమంది అతిథులు విలాసవంతంగా ప్రయాణించడానికి వీలు ఉంటుంది. అతిథుల ఆహ్లాదం కోసం ఏర్పాటు చేసిన డైవింగ్ స్కూటర్లు, జెట్ స్కీ బోట్లు వంటివి కూడా పూర్తిగా బంగారు తాపడం చేసినవే కావడం విశేషం. ఇందులో నాలుగు లగ్జరీ సూట్‌లు, ప్రత్యేక డైనింగ్ రూమ్‌లు, బాంకెట్ హాల్, స్విమింగ్ పూల్, బాక్సింగ్ పరికరాలతో కూడిన అధునాతన జిమ్, సినిమా థియేటర్, డీజే బూత్, పబ్ వంటి విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయి.
ఏకంగా 136 అడుగుల పొడవు ఉండే ఈ నౌకను ఎటు నుంచి చూసినా కళ్లు చెదిరేలా బంగారు ధగధగలే కనిపిస్తాయి. ఏటా వేసవిలోను, శీతకాలంలోను దీనిని ప్రయాణికుల విహారానికి అద్దెకు ఇస్తున్నారు. ఇందులో ప్రయాణించాలంటే వారం రోజులకు లక్ష పౌండ్లు (రూ.1.05 కోట్లు) చెల్లించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment