అందరి చేతుల్లో ఫోన్లు ఉంటాయి. ‘కాస్త ఫొటో తీయరా’ అనంటే బుడుంగుమని వచ్చి క్లిక్ చేస్తాం. అంతమాత్రం చేత మనం ఫొటోగ్రాఫర్లం అవము. ఫొటోగ్రఫీ పెద్ద ఆర్ట్. ఫ్యాషన్ ఫొటోగ్రఫీ, ఔట్‌డోర్ ఫొటోగ్రఫీ, స్టిల్ ఫొటోగ్రఫీ... ఇలా చాలా విభాగాలున్నాయి. వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ కూడా ఒకటి. అంటే వన్యజీవితాన్ని ఫొటోలు తీయడం. దీనికి అభిరుచి, ధైర్యం, నైపుణ్యం కావాలి. అడవుల్లోకి వెళ్లి రోజుల తరబడి ఎదురు చూస్తేనే ఒక మంచి ఫొటో దొరుకుతుంది. అలాంటి ఫొటో తీసి అంతర్జాతీయ గుర్తింపు పోందింది శ్రేయోవి మెహతా.
ఫరిదాబాద్‌లో నాల్గవ తరగతి చదువుతున్న ఈ 9 సంవత్సరాల చిన్నారి చిన్నప్పటి నుంచి ఫొటోలు తీయడం నేర్చుకుంది. కారణం ఆమె తండ్రి శివాంగ్ మెహతా మంచి ఫొటోగ్రాఫర్. తల్లి కహాని మెహతా పర్యాటకులను అభయారణ్యాలకు తీసుకెళుతుంటుంది. శ్రేయోవి తన తల్లిదండ్రులతో రాజస్థాన్‌లోని భరత్‌పూర్ నేషనల్ పార్క్‌లో ఉన్నప్పుడు ఒక తెల్లవారుజామున వాకింగ్ చేస్తుంటే హటాత్తుగా దూరంగా రెండు నెమళ్లు కనిపించాయి. పక్కనే ఒక లేడి కూన. వెంటనే శ్రేయోవి తన కెమెరా తీసి మోకాళ్ల మీద కూచుని క్లిక్ చేసింది. ఆ తెల్లవారుజామున మంచుకురుస్తున్న వేళ చీకటి వెలుతురుల్లో ఆ ఫొటో అద్భుతంగా కుదిరింది.
60 వేల ఎంట్రీల్లో ఒకటి
లండన్‌లోని ‘నేచురల్ హిస్టరీ మ్యూజియం’ ప్రతి ఏటా ‘వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్‘ అవార్డు కోసం ఎంట్రీలు పిలుస్తుంది. ఇందులో వయసును బట్టి విభాగాలుంటాయి. 10 ఏళ్ల లోపు విభాగంలో 117 దేశాల నుంచి 60 వేలమంది బాలలు తాము తీసిన వైల్డ్‌లైఫ్ ఫొటోలు పంపితే శ్రేయోవి ఈ ఫొటో పంపింది. ఇంతమందిని దాటి శ్రేయోవి ఈ ΄ోటీలో రన్నర్ అప్‌గా నిలిచింది. అంటే సెకండ్ ప్లేస్ అన్నమాట. అయినా సరే ఇది పెద్ద విజయం. ‘మా అమ్మా నాన్నా ప్రోత్సహించడం వల్ల నేను ఇలా గుర్తింపు పోందాను’ అంటోంది శ్రేయోవి. పెద్దయ్యి ఇంకా గొప్ప ఫొటోలు తీస్తానంటోంది.
Comments
Please login to add a commentAdd a comment