అమ్మ... ప్రేమ ఎంత తియ్యగా ఉంటుందో ఆమె చేతి వంట కూడా అంతే కమ్మగా ఉంటుందని గుర్తించిన ఆవుల భార్గవి ‘అమ్మచేతి వంట’ను ఆయుధంగా చేసుకుని సక్సెస్‌పుల్ యూట్యూబర్‌గా రాణిస్తున్నారు. భార్గవి తల్లి వెన్నుతట్టి దారిచూపడంతో తనదైన శైలిలో వంటల వీడియోలు పోస్టుచేస్తూ లక్షలమంది యూజర్లను ఆకట్టుకుంటూ ఎంతోమంది యువతీయువకులకు ప్రేరణగా నిలుస్తున్నారు. రాజమండ్రిలో పుట్టిపెరిగిన భార్గవికి బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తవ్వగానే పెద్దలు పెళ్లి చేశారు. పెళ్ళయ్యాక భర్తతో విశాఖపట్నంలో ఉండేది. వెంట వెంటనే ఇద్దరు పిల్లలు పుట్టడంతో ఇల్లు, పిల్లలతో బిజీగా ఉండేది. 2017 జనవరిలో.. సంక్రాంతి పండక్కి పుట్టింటికి వెళ్లింది. ఆ సమయంలో భార్గవి తల్లి గీతామహాలక్ష్మి ‘‘మనం చేసే వంటలను వీడియోలు తీసి యూ ట్యూబ్‌లో పెడితే అవి చాలామంది చూస్తారు. నువ్వు అలా చేయవచ్చు కదా! మొదట నేను వంట చేసి వీడియోలు తీస్తాను. నువ్వు వాటిని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చెయ్యి’’ అని సలహా ఇచ్చారు. దానికి సరేనంది భార్గవి.
తల్లి ప్రోత్సాహంతోనే...
యూట్యూబ్‌లో వీడియోలు పెట్టాలని ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోని భార్గవి సంక్రాంతి తరువాత విశాఖపట్నం తిరిగి వెళ్లి బిజీ అయిపోయింది. ఆ సమయంలో భార్గవి తల్లి ఫోన్ చేసిప్పుడల్లా గుర్తు చేసేవారు. దాంతో భార్గవి తను వంట చేసేటప్పుడు వీడియోలు తీసి పెట్టుకునేది. 2017 మే 31న ‘అమ్మ చేతివంట’ పేరిట యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించి .. ఆ వీడియోలను పోస్టు చేసింది.
అయితే వాటికి చెప్పుకోదగ్గ వ్యూస్ రాకపోవడంతో సబ్‌స్రై్కబర్స్‌ని ఎలా పెంచుకోవాలి? వ్యూస్ ఎలా పెరుగుతాయి? ట్యాగ్స్, టైటిల్స్, థంబ్ నెయిల్స్ ఎలా పెట్టుకోవాలి... అనే విషయాలపై టెక్ ఛానల్స్‌లో గాలించి, తెలుసుకుని ప్రొఫెషనల్‌గా వీడియోలు పెట్టడం నేర్చుకుంది. మొదటి నెలలోనే 90 వీడియోలు పోస్టు చేసింది. ఛానల్ క్లిక్ అవడంతో..గతేడాది..‘‘మనలో మనమాట’’ పేరిట మరోఛానల్‌ను ప్రారంభించి వ్యూవర్స్‌కు ఉపయోగపడే సమాచారం అందిస్తోంది.
ప్రసాదాలతో ఫేమస్..
దసరా నవరాత్రులలో నైవేద్యం పెట్టే ప్రసాదం తయారీ వీడియోలకు మంచి స్పందన రావడంతో భార్గవి ఛానల్ బాగా ఫేమస్ అయ్యింది. వ్యూవర్స్ ‘‘మీరు చేసిన వంటను మేము ప్రయత్నించాము... చాలా బాగా వచ్చింది’’ అని ప్రోత్సాహంతో కూడిన కామెంట్లు చేయడంతో మరిన్ని వీడియోలు పోస్టుచేసేది. ఛానల్ ప్రారంభించిన ఐదు నెలల్లో మంచి గుర్తింపుతోపాటు, యాడ్‌లు కూడా వచ్చేవి. తన వీడియోలలో ఆనియన్ సమోసా బాగా క్లిక్ అయ్యింది. వీడియో అప్‌లోడ్ చేసిన రెండు వారాల్లోనే పదిలక్షల వ్యూస్ వచ్చాయి. ఇన్‌స్టంట్‌గా చేసుకునే టమోటా పచ్చడి, పానీపూరి వీడియోలు సబ్‌స్క్రైబర్స్‌ని అమాంతం పెంచేశాయి.ముఖ్యంగా స్నాక్స్ వీడియోలు, లాక్‌డౌన్‌లో ఓవెన్ లేకుండా కేక్ తయారీ వంటకాల వీడియోలకు మంచి ఆదరణ వచ్చింది. కేక్ తయారీ వీడియోలు యూ ట్యూబ్ టాప్ ట్రెండింగ్ వీడియోలలో భార్గవి కేక్ తయారీ వీడియోలు నంబర్ వన్ స్థానంలో నిలిచాయి. వెజ్, నాన్‌వెజ్ వంటకాల వీడియోలకు సబ్‌స్రై్కబర్స్ పెరగడంతో యూట్యూబ్ సిల్వర్ బటన్, గోల్డ్ ప్లే బటన్‌లతో భార్గవిని సత్కరించింది. ప్రస్తుతం ‘అమ్మ చేతివంట’ ఛానల్‌కు దాదాపు ఇరవై లక్షలమంది సబ్‌స్రై్కబర్స్ ఉన్నారు.
కంటెంట్‌ను బట్టి సబ్‌స్క్రైబర్లు..
‘‘నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం వల్లే యూట్యూబ్ ఛానల్‌ను నడపగలుగుతున్నాను. ‘యూ ట్యూబ్‌లో చేసిన వంటకాలు మనం చేస్తే సరిగ్గా రావు’ అని జనాల్లో నాటుకుపోయిన అభిప్రాయాన్ని తీసేయాలనుకున్నాను. అందుకే నేను చేసిన వంటను మా వారికి రుచి చూపించి ఆయన ఓకే అంటే ఆ వీడియోను పోస్టు చేస్తాను.
వ్యూవర్స్ నా వీడియో చూసి చేసిన వంటకు కూడా అదే రుచి వచ్చే విధంగా చేస్తాను. కొత్తగా ఛానల్స్ పెట్టినవారు.. వ్యూస్ రావడం లేదని నిరాశపడకూడదు. మంచి కంటెంట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించాలి. కంటెంట్‌ను బట్టి సబ్‌స్రై్కబర్స్ పెరుగుతారు’’ అని భార్గవి చెప్పింది.
–సంభాషణ: పి. విజయ
Comments
Please login to add a commentAdd a comment