గత రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ స్వరూపం మారిపోయింది. గత పాలకుడి మాదిరిగా ప్రతిరోజూ మీడియాలో కన్పించాలన్న ధ్యాస, యావ సీఎం వైఎస్ జగన్‌కి లేవు. ప్రతి చిన్న అంశాన్ని భూతద్దంలో చూపించి.. అవన్నీ తన ఘనతలుగా చాటుకోవాలన్న కోరిక ఆయనలో లేదు. సీఎం ఒక్కడే పనిచేస్తున్నాడన్న భావన కల్పించడానికి అప్పట్లో అందరూ శ్రమించారు. ఇపుడు.. సీఎంతోపాటు చిట్టచివరి గ్రామ, వార్డు వాలంటీరు కూడా కష్టపడుతున్నారన్న వాస్తవాన్ని సీఎం వైఎస్ జగన్ స్వయంగా చాటి చెబుతున్నారు. ప్రజలకు ఏమాత్రం మేలు చేయని, అవసరం లేని సంప్రదాయ రాజకీయ విధానాలకు సీఎం వైఎస్ జగన్ చెల్లుచీటీ పాడారు. ఇపుడు రాష్ట్రంలో వెల్లివిరిస్తోంది.. సంక్షేమ సంస్కృతి. తోవ చూపుతున్నది అభివృద్ధి పంథా!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నేడు అనేక అంశాలలో దేశానికే ఓ రోల్ మోడల్‌గా నిలుస్తారు. అందుకు పలు ఉదాహరణలు చెప్పుకోవచ్చు. కరోనా రెండోదశ ఉధృతి తీవ్రంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు రెండు నెలలు ముందుగానే హెచ్చరికలు చేసినప్పటికీ దేశంలో ఎన్నికల క్రతువు, కుంభమేళా జాతరలను వాయిదా వేయలేదు. వాటి నిర్వహణ కనీసం కోవిడ్ నిబంధనలకు లోబడి జరగలేదు. అయితే, అదే సమయంలో రాష్ట్రంలో తిరుపతి లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నిక ప్రచార సభలో పాల్గొనకుండా.. దానిని రద్దు చేసుకొని తనకు ఎన్నికల లాభం కంటే ప్రజారోగ్యమే మిన్న అని వైఎస్ జగన్ చాటి చెప్పారు. ప్రజల ఆరోగ్యమే తనకు ముఖ్యమని భావిం చారు. అందుకే రాష్ట్ర ప్రజలకు ఆయన అత్యంత ఆప్తుడిగా మారారు. కనుకనే, పంచాయతీ, మున్సిపల్, జెడ్పీ ఎన్నికలలో ఆయన ఎన్నికల ప్రచారం చేయకపోయినా.. ప్రతిపక్షాన్ని చిత్తుచిత్తుగా ఓడించమని పిలుపు ఇవ్వకపోయినా, ప్రజలు ఆయనను ఆదరించారు. సీఎం జగన్ చిరునవ్వు ఒక్కటే అధికార పార్టీకి ప్రచారాస్త్రమైంది. ఫలితంగానే, అసెంబ్లీ ఎన్నికలలో పోలైన ఓట్ల శాతాన్ని మించి అదనంగా మరో 10 శాతం ఓట్లతో.. స్థానిక సంస్థల ఎన్నికలలో కనీవినీ ఎరుగని చారిత్రక విజయం వైఎస్సార్‌సీపీకి దక్కింది.
ఆచరించి చూపేవారే నాయకులు
కరోనా వంటి ప్రాణాంతక వైరస్ ప్రజల ప్రాణాలను హరిస్తున్న నేపథ్యంలో రాజకీయాలను ఇంకా సంప్రదాయశైలిలో నిర్వహించడం మంచిది కాదనే సందేశాన్ని వైఎస్ జగన్ తిరుపతి ఉపఎన్నిక సందర్భంగా స్పష్టం చేశారు. కానీ.. ఎన్నికలలో గెలుపే పరమావధిగా భావించినవారు.. ఎప్పటిలాగానే పెద్దఎత్తున బహిరంగ సభలు, ర్యాలీలతో మోత మోగించారు. జనాన్ని సమీకరించి ప్రచారాన్ని తారాస్థాయికి తీసుకెళ్లారు. తిరుపతి మొదలుకొని ఎన్నికలు జరిగిన రాష్ట్రాలలో ఇదే విధానం కనిపించింది. అయితే, కోవిడ్ నేపథ్యంలో ఈ సంప్రదాయ రాజకీయ విధానాలకు బలైంది సామాన్యులే.
తిరుపతి ఉపఎన్నికలో వివిధ రాజకీయ పార్టీల భారీ ప్రచారం వల్ల చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో అంతకు ముందు కంటే కేసులు పెరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో నాగార్జునసాగర్ శాసనసభకు జరి గిన ఉపఎన్నిక సందర్భంగా ప్రచార ముగింపు దశలో భారీ బహిరంగ సభ నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారినపడి అదృష్టవశాత్తూ కోలుకోగలిగారు. ఆ ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న అన్ని పార్టీలకు చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో కరోనా బాధితుల జాబి తాలో చేరిపోయారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ మొదలుకొని శశిథరూర్, అధీర్‌రంజన్‌రాయ్, ఆనంద్ శర్మ తదితరులు వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనడం వల్ల కరోనా బారిన పడ్డారు. ఆ విషయాన్ని వారే స్వయంగా వెల్లడించడం గమనార్హం! అగ్రనేతలు ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం వల్ల లక్షల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు సభలకు, ర్యాలీలకు హాజరయ్యారు. అగ్రనేతలు లేకుంటే ప్రచార సభలు సాధారణంగానే జరిగేవి. కరోనా తీవ్రత ఈ స్థాయిలో ఉండేది కాదు. ఈ వాస్తవం తెలిసీ ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఎన్నికల ప్రచార సభలలో పాల్గొనడం జీర్ణించుకోలేనిది. కఠోర పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రజలకు సరైన మార్గాన్ని దిశానిర్దేశం చేసేవారే నిజమైన నాయకులు. కరోనా కట్టడిలో పాటించాల్సిన జాగ్రత్తల్ని అగ్రనేతలే ఉల్లంఘించినప్పుడు సామాన్యులకు సుద్దులు చెప్పడం ఏ రకమైన నీతి అవుతుంది?
ప్రజలను ఓటర్లుగా పరిగణించే వికృత సంస్కృతి
మన దేశంలో.. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలను కేవలం ఓట ర్లుగా పరిగణించే వికృత సంస్కృతి కొన్ని దశాబ్దాల క్రితం వేళ్ళూనుకొంది. అన్నదమ్ముల్లా కలిసిమెలసి ఉండే వర్గాల మధ్య కులచిచ్చు రేపే రాజకీయం చేయడం; జిల్లాలవారీగా కులాల సంఖ్యాబలం బట్టి కొందరికి గొడుగు పట్టడం, మరికొందర్ని విస్మరించడం.. ఈ విధంగా మొత్తం తమ ఎజెండాను రాజకీయలబ్ధి కోసం ఎన్నికల చుట్టూ తిప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలను ప్రజలుగానే పరిగణిం చిన మహానాయకులు ఇద్దరు. అందులో ఒకరు ఎన్టీఆర్, రెండోవారు డాక్టర్ రాజశేఖరరెడ్డి. ఎన్నికల్లో అనవసరంగా డబ్బు ఖర్చు చేయొ ద్దని చెప్పేవారు ఎన్టీఆర్. కులమత ప్రాంతాలకు అతీతంగా, చివరకు పార్టీలతో నిమిత్తం లేకుండా ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందించినవారు వైఎస్సార్. సీఎంగా ఉండగా.. వైఎస్సార్ తమ పట్ల కనబర్చిన ఉదారతను, తాము ఇచ్చిన విజ్ఞాపన పత్రాలపై ఆయన స్పందించిన తీరును ఇప్పటికీ వివిధ పార్టీల నేతలు గొప్పగా చెబుతారు.
విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌లో ఆ ఇద్దరు మహానేతల లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ప్రజల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యంగా ఎన్ని కష్టాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ సమకాలీన రాజకీయ వ్యవస్థలో కనుమరుగవుతున్న విలువల్ని పెంచుతున్నారు. ‘ఓడ ఎక్కేదాకా ఓడ మల్లయ్య.. ఓడ దిగాక వోటి మల్లయ్య’ అనే తీరులో అధికారంలో ఉన్న వారు వ్యవహరిస్తారని ప్రజల్లో నెలకొన్న నానుడిని సీఎం వైఎస్ జగన్ చెరిపివేశారు. అధికారంలో ఉన్నవారి పట్ల ప్రజలు పూర్తి నమ్మకంతో ఉండటం సామాన్యమైన అంశం కాదు.
మారిన రాజకీయ స్వరూపం
గత రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ స్వరూపం మారిపోయింది. గత పాలకుడి మాదిరిగా ప్రతిరోజూ మీడియాలో కన్పించాలన్న ధ్యాస, యావ సీఎం వైఎస్ జగన్‌కి లేవు. ప్రతి చిన్న అంశాన్ని భూతద్దంలో చూపించి.. అవన్నీ తన ఘనతలుగా చాటుకోవాలన్న కోరిక ఆయనలో లేదు. మీడియాలో కన్పించడం కోసం, ప్రతిరోజూ జిల్లాలకు వెళ్లి.. గతంలో వేసిన శిలాఫలకాలను మళ్లీ మళ్లీ వేయడం, పెట్టుబడుల వేట అంటూ మందీమార్బలంతో ప్రత్యేక విమానాల్లో విదేశీ పర్యటనలు చేయడం, పెట్టుబడి సదస్సుల పేరుతో హడావుడి చేయడం.. మొదలైన కృత్రిమ ప్రచారాలకు సీఎం జగన్ దూరంగా ఉంటున్నారు. మంత్రులు, అధికారులను వారిపని వారిని చేసుకోనిస్తున్నారు. అవసరమైన దిశానిర్దేశం చేయడం, సమీక్షలు జరిపి పురోగతిని తెలుసుకోవడం.. వంటి వికేంద్రీకరణ విధానాన్ని పరిపాలనలో ప్రవేశపెట్టారు. ఫలితంగానే, గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రజలకు అందే సేవలు, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు సజావుగా, వేగంగా, నిశ్శ బ్దంగా సాగిపోతున్నాయి. ప్రభుత్వపరంగా ఎక్కడా హడావుడి ఆర్భాటం లేదు. గత పాలకుడి మాదిరిగా మొత్తం రాష్ట్రాన్ని తన భుజస్కంధాల మీదనే అతికష్టం మీద మోస్తున్న బిల్డప్‌లు ఇపుడు కనపడవు.
ఇపుడు రాష్ట్రంలో ఓ నూతన రాజకీయ సంస్కృతి వెల్లివిరిస్తోంది. ప్రభుత్వ యంత్రాంగంలో ఉత్సాహం, చురుకుదనం, జవాబుదారీ తనం నేడు కనిపిస్తున్నాయి. ప్రజలకు అందుతున్న సేవల్లో వేగం, నాణ్యత పెరిగాయి. ముఖ్యమంత్రి ఒక్కడే పనిచేస్తున్నాడన్న భావన కల్పించడానికి అప్పట్లో అందరూ శ్రమించారు. ఇపుడు.. సీఎంతోపాటు చిట్టచివరి గ్రామ, వార్డు వాలంటీరు కూడా కష్టపడుతున్నారన్న వాస్తవాన్ని వైఎస్ జగన్ స్వయంగా చాటి చెబుతున్నారు. వాలంటీర్లకు ప్రోత్సాహకాలు అందించడం ఇందుకు తాజా ఉదాహరణ. ‘స్వేచ్ఛ’ అన్ని హక్కులకు మూలం అని, అభివృద్ధికి సాధనం అని డా. బి.ఆర్. అంబేడ్కర్ చెప్పిన విధంగానే నేడు.. ఏపీలో అన్ని వ్యవస్థలు స్వేచ్ఛగా పనిచేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రజలకు ఏమాత్రం మేలు చేయని, అవసరం లేని సంప్రదాయ రాజకీయ విధానాలకు సీఎం వైఎస్ జగన్ చెల్లుచీటీ పాడారు. ఇప్పుడు రాష్ట్రంలో వెల్లివిరిస్తోంది.. సంక్షేమ సంస్కృతి. తోవ చూపుతున్నది అభివృద్ధి పంథా!
సి. రామచంద్రయ్య
వ్యాసకర్త మాజీ మంత్రి
ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ
సంప్రదాయ రాజకీయాలకు చెల్లుచీటీ
Published Sat, Apr 24 2021 2:32 AM | Last Updated on Sat, Apr 24 2021 4:33 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment