ప్రపంచ శక్తిగా భారత్‌ ఎదగాలంటే... | How Will India grow as a world power | Sakshi
Sakshi News home page

ప్రపంచ శక్తిగా భారత్‌ ఎదగాలంటే...

Published Sat, Aug 20 2022 12:39 AM | Last Updated on Sat, Aug 20 2022 12:59 AM

How Will India grow as a world power - Sakshi

కేంద్ర ప్రభుత్వం తన విజన్‌  ఇండియా 2047 లక్ష్యసాధన కోసం పరిశోధన, సృజనాత్మకత, టెక్నాలజీలను ప్రధాన చోదక శక్తులుగా గుర్తించింది. ఈ లెక్కన 2047 నాటికి భారత్‌ ఒక విజ్ఞాన ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. స్థానికంగా ఆలోచిస్తూ, విస్తారంగా ప్రపంచ ప్రభావం కలిగించే స్టార్టప్, వ్యాపార సంస్థలను ప్రోత్సహిస్తుంది.  ఆరోగ్య సంరక్షణ రంగాన్ని డిజిటల్‌ పరివర్తనవైపు తీసుకెళ్లే క్షేత్రస్థాయి కార్యాచరణకు ఇప్పటికే పునాది పడింది. 2025 నాటికి దేశ స్థూల జాతీయోత్పత్తిలో 2.5 శాతాన్ని ఆరోగ్య సంరక్షణ రంగంపై వెచ్చించేలా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నాణ్యమైన సార్వత్రిక ఆరోగ్య సంరక్షణను నిజంగా అందించడానికి 2047 సంవత్సారానికి దాన్ని 5 శాతం పెంచేందుకు తప్పకుండా సన్నద్ధం కావాలి.

స్వాతంత్య్రం సిద్ధించి వంద సంవత్సరాలు పూర్తయ్యే నాటికి మనదేశం గ్లోబల్‌ ఇన్నో వేషన్‌ లీడర్‌ కావాలనేది నా విజన్‌. ఆరోగ్యరంగం, విద్య, నిలకడైన జీవితాన్ని సమానంగా అందుకుంటూ ఒక సురక్షిత వాతావరణంలో ప్రతి ఒక్కరూ సౌభాగ్యానికి నోచుకునే సమ్మిశ్రితమైన ఆర్థిక వృద్ధిపై దేశం అప్పటికి దృష్టి పెట్టివుంటుంది. మౌలిక భావనలపై మదుపు చేయడం ద్వారా, వ్యవస్థాపకతను ఆర్థిక వృద్ధి నమూనాగా చేయడం ద్వారా భారతదేశం తన పౌరులందరికీ ఉన్నత జీవితానికి హామీ ఇస్తుంది. టెక్నాలజీతో కూడిన పరిశోధన, సృజనాత్మకతలు పెను గంతుతో కూడిన ఆర్థిక వృద్ధికి ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. దీనివల్ల 2047 నాటికి భారత్‌ ప్రపంచంలోని మూడు పెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలబడటమే కాదు, అభివృద్ధి చెందిన దేశపు హోదాకు దగ్గరవుతుంది.

కేంద్ర ప్రభుత్వం తన ‘విజన్‌ ఇండియా 2047’ లక్ష్యసాధన కోసం పరిశోధన, సృజనాత్మకత, టెక్నాలజీలను ప్రధాన చోదక శక్తు లుగా గుర్తించింది. ఈ రంగాల్లో భారీ పెట్టుబడులు పెడుతోంది. ఈ లెక్కన 2047 నాటికి భారత్‌ ఒక విజ్ఞాన ఆర్థిక వ్యవస్థగా మారు తుంది. స్థానికంగా ఆలోచిస్తూ, విస్తారంగా ప్రపంచవ్యాప్తంగా ప్రభావం కలిగించే స్టార్టప్, వ్యాపార సంస్థలను ప్రోత్సహిస్తుంది. చిన్న, మధ్య స్థాయి కంపెనీల నుంచి భారీ పారిశ్రామిక కార్య కలాపాలవైపు ఎదిగేలా ‘టెక్నోప్రెన్యూర్ల’ను ప్రోత్సహించడం ద్వారా ప్రపంచ మార్కెట్లకు భారత సృజనాత్మక భావనలను తీసుకుపోయే అవకాశా లను సృష్టించగలుగుతుంది. 2047 నాటికి గ్లోబల్‌ ఇన్నో వేషన్‌ ఇండెక్స్‌లో టాప్‌ 20 దేశాల్లో భారత్‌ను ఒకటిగా నిలబట్టే లక్ష్యాన్ని మనం పెట్టుకోవాలి.

సరసమైన ధరలకు లభించే ఇంటర్నెట్‌తో కూడిన డిజిటల్, డేటా మద్దతు కలిగిన సృజనాత్మక ఆలోచనలు భవిష్యత్తులో వేగంగా ఎదిగే డిజటల్‌ ఆర్థిక వ్యవస్థను నిర్మించడంలో తోడ్పడతాయి. భారత్‌ దేశా నికి ఉన్న శాస్త్రీయ ప్రతిభ  ద్వారా ఆరోగ్యరంగంలో ఉత్పాదకతను, నాణ్యతను ప్రోత్సహించగలదు. ఆ విధంగా సరసమైన ధరలకు ఆరోగ్య సేవలను అందించడం, ముందస్తు వ్యాధి నివారక విధానా లను అమలు చేయడం సాధ్యపడటమే కాకుండా, సమగ్ర ఆరోగ్య సంరక్షణ పర్యావరణ వ్యవస్థకు నిజమైన విలువను తీసుకొస్తుంది. అందరికీ అందుబాటులో ఉండే, వ్యవస్థీకృతంగా, జవాబుదారీ తనంతో ఉండే, సరసమైన ధరలతో, స్వావలంబనతో కూడిన జాతీయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను నిర్మించడంలో ఇది తోడ్పడుతుంది.

భారత్‌లో ఆరోగ్య సంరక్షణ రంగాన్ని డిజిటల్‌ పరివర్తనవైపు తీసుకెళ్లే క్షేత్రస్థాయి కార్యాచరణకు ఇప్పటికే పునాది పడింది. ఆరోగ్య సంరక్షణకు సంబంధించి క్రమబద్ధీకరణలను మరింత సరళం చేస్తూ కేంద్రప్రభుత్వం తెచ్చిన సంస్కరణలను మనం అభినందించాలి. అదే సమయంలో, మహమ్మారి వినియోగదారుల ప్రవర్తనలో మార్పులు తీసుకొచ్చింది. డాక్టర్లను ‘టెక్‌ సావీ’లుగా మార్చడమే కాదు, యూజర్‌ ఫ్రెండ్లీ డిజిటల్‌ సొల్యూషన్లపై ఆరోగ్య సంరక్షణ రంగం మరిన్ని పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించింది. ఈ పరిణామాలన్నీ తక్కువ వ్యయంతో కూడిన, టెక్నాలజీ ఆధారిత సృజనాత్మక ఆవిష్కరణలను సరసమైన ధరలకు అందించే ఒక ఫలప్రదమైన వాతావరణాన్ని కల్పించాయి.

ఆరోగ్య సంరక్షణ రంగంలో డిజిటల్‌ చొరబాటుకు సంబంధిం చిన పూర్తి ప్రయోజనాలను అందించేందుకు భారత్‌ విధానాల రూప  కల్పననూ, నిధులనూ ఒక సమన్వయంతో అమలు చేయవలసిన అవసరం ఉంది. 2025 నాటికి దేశ స్థూల జాతీయోత్పత్తిలో 2.5 శాతాన్ని ఆరోగ్య సంరక్షణ రంగంపై వెచ్చించేలా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రామాణీకరించబడిన, నాణ్యమైన సార్వత్రిక ఆరోగ్య సంరక్షణను నిజంగా అందించడానికి 2047 సంవత్సానికి మన జీడీపీలో ఆరోగ్య సంరక్షణ వ్యయాన్ని 5 శాతం పెంచేందుకు భారత్‌ తప్పకుండా సన్నద్ధం కావాలి.

భారత ఔషధ పరిశ్రమ ఇప్పటికే ‘ప్రపంచ ఫార్మసీ’గా వెలు గొందుతోంది. ఔషధోత్పత్తి పరిమాణం రీత్యా భారత్‌ ప్రపంచంలోనే మూడో ర్యాంకులో నిలబడుతోంది. రాగల 25 సంవత్సరాల్లో ఫార్మా స్యూటికల్‌ వాల్యూ చెయిన్‌లో మరింత వాటాను సంగ్రహించగల గాలి. దీనికోసం, వినూత్నమైన బయోలాజిక్స్, బయోసిమిలర్స్, సెల్, జీన్‌ థెరపీలు, హై ఎండ్‌ కాంట్రాక్ట్‌ రీసెర్చ్‌ , తయారీ సేవల్లో ఆవిర్భవిస్తున్న అవకాశాలపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉంది. అలాగే ‘ఎంఆర్‌ఎన్‌ఏ’తో పాటు ఇతర నూతన తరం టీకాలు, ‘ఆర్ఫన్‌ డ్రగ్స్‌’, విలువైన మందులు, మోలిక్యులార్‌ డయాగ్నసిస్‌ వంటి అంశాలపై కూడా మనం దృష్టి సారించాల్సి ఉంది. సరైన విధానాలతో భారత ఔషధ పరిశ్రమ ప్రస్తుతం ఉన్న 50 బిలియన్‌ డాలర్లనుంచి 2047 నాటికి 500 బిలియన్‌ డాలర్ల పరిశ్రమగా ఎదిగి, ప్రపంచంలోని టాప్‌ అయిదు దేశాల సరసన నిలబడుతుంది. ఇక ఔషధోత్పత్తి పరిమాణం రీత్యా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంటాం.

ఫార్మా రంగంలో 500 బిలియన్‌ డాలర్ల వాణిజ్యాన్ని సాధించే రోడ్‌ మ్యాప్‌లో అధునాతన పరిశోధన, సృజనాత్మకతలను స్వీక రించడం, గ్లోబల్‌ స్థాయి ఆపరేషన్లను నిర్వహించడం, నాణ్యమైన క్రమబద్ధీకరణ వ్యవస్థను రూపొందించడం ఉంటాయి. పరిశోధనతో సంబంధ ప్రోత్సాహకాలు ఫార్మారంగంలో పరిశోధన, అభివృద్ధిపై పెట్టుబడులను పెంచుతాయి. అలాగే మరింత మెరుగైన పరిశ్రమ– అకెడమిక్‌ భాగస్వామ్యాలను పెంచుతాయి. 

2047 నాటికి అంతర్జాతీయ ఆర్థిక శక్తిగా మారడానికి, భారత దేశం తన మహిళా శక్తికి సాధికారత కల్పించాలి. ఒక దేశంగా ఆర్థిక ప్రధాన స్రవంతిలో మహిళలకు అవకాశాలను కల్పించడమే కాకుండా, ఉత్పాదక కృషిలో స్వేచ్ఛగా పనిచేసే వీలు కల్పించాలి. వేతనం లేని శ్రమ శృంఖలాల నుంచి వారిని విముక్తి చేయాల్సి ఉంది.

భారతదేశ నియత కార్మిక శక్తిలో మహిళల భాగస్వామ్యం ప్రస్తుతం 24 శాతంగా మాత్రమే ఉంటోంది. అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే ఇది అత్యంత తక్కువ శాతంగానే చెప్పాలి. అనియత రంగంలో పనిచేస్తున్న భారత మహిళల్లో చాలా మందికి సామాజిక రక్షణ తక్కువ. పైగా వేతనాలు కూడా తక్కువగా ఉంటు న్నాయి. మహిళలను నియత ఆర్థిక వ్యవస్థలోకి పురుషుల భాగ స్వామ్యంతో సమానంగా తీసుకురాగలిగితే, 2025 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ మరో 60 శాతం వృద్ధి చెందగలదని అంచనా. అంటే ఆర్థిక వ్యవస్థకు 2.9 ట్రిలియన్‌ డాలర్ల ఆదాయం జమవుతుంది. రెండంకెల వృద్ధిని సాధించాలంటే, మన ‘టాలెంట్‌ పూల్‌’లో సగ భాగంగా ఉన్న మహిళల శక్తిని విస్మరించలేము. విద్య, ఆరోగ్యం, ఆర్థిక భద్రత, ప్రాథమిక హక్కుల వంటి అంశాల్లో మహిళా కేంద్రక కార్యక్రమాలను చేపట్టాలి. 2047 నాటికి నియత రంగంలో 50 శాతం మహిళా భాగస్వామ్యాన్ని తప్పక పెంచాల్సి ఉంటుంది.

2047 నాటికి, పునరుద్ధరణీయ శక్తివనరులపై దృష్టి పెట్టాలి. వ్యర్థాలను, ఉద్గారాలను తగ్గిస్తూ, వినిమయ సంస్కృతిని తగ్గించాలి. రీసైకిలింగ్, రీయూజ్‌ వంటి విధానాలను ప్రవేశ పెట్టాలి. దీనికోసం, భారత్‌ తన వృద్ధి నమూనాల్లో సంపూర్ణంగా సమగ్ర పర్యావరణ స్వావలంబనను చొప్పించాల్సిన అవసరం ఉంది. ఒక దేశంగా మన విద్యుత్‌ అవసరాల్లో 80 శాతాన్ని 2047 నాటికి పునర్వినియోగ శక్తి వనరుల ద్వారా తీర్చుకోవడం మన లక్ష్యం కావాలి. పారదర్శకమైన, సమర్థవంతమైన, ఆర్థికంగా సమ్మిశ్రిత రూపంలో ఉండే డిజిటల్‌ సాధికారిక సమాజాన్ని, విజ్ఞాన ఆర్థిక వ్యవస్థను రూపొందించడం ద్వారా నూరవ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఆవిర్భవించగలదు. అలాగే నిజమైన గ్లోబల్‌ శక్తిగా కూడా నిలబడగలదు.


కిరణ్‌ మజుందార్‌ షా, వ్యాసకర్త ప్రముఖ పారిశ్రామిక వేత్త

(‘ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ సౌజన్యంతో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement