వ్యవసాయరంగంలో నిశ్శబ్ద విప్లవం | Silent Revolution in Andhra Pradesh Agriculture: Ummareddy Venkateswarlu | Sakshi
Sakshi News home page

వ్యవసాయరంగంలో నిశ్శబ్ద విప్లవం

Published Thu, Apr 7 2022 2:19 PM | Last Updated on Thu, Apr 7 2022 2:19 PM

Silent Revolution in Andhra Pradesh Agriculture: Ummareddy Venkateswarlu - Sakshi

వ్యవసాయరంగ ప్రగతి, అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అగ్ర స్థానానికి చేరింది. 29 రాష్ట్రా లలో మొదటి స్థానంలో నిలి చింది. ఈ సంగతిని స్వయంగా కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల కొక సారి ప్రకటించే గుడ్‌ గవర్నెన్స్‌ సూచీ తెలియజేసింది. అందుకు అనుగుణంగానే, వ్యవసాయ రంగంలో ముందంజలో ఉన్నందుకుగాను ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రతిష్టాత్మకమైన ‘‘స్కోచ్‌ గవర్నెన్స్‌’’ అవార్డు లభించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎటువంటి హడావుడి, ఆర్భాటం, ప్రచారం లేకుండా నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ సాధించిన ఓ అద్భుత విజయం ఇది. 

వ్యవసాయం గిట్టుబాటు వృత్తి కాదనీ, వ్యవ సాయం దండగనీ తనకంటే ముందు రాష్ట్రాన్ని 5 ఏళ్లపాటు పరిపాలించిన చంద్రబాబు నాయుడు రైతుల మైండ్‌సెట్‌ను మార్చడానికి ప్రయత్నించిన ఫలితంగా వ్యవసాయ రంగంలో స్తబ్దత నెలకొంది. అటువంటి నేపథ్యంలో... 2019 మేలో అధికార పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముందు చూపుతో, స్పష్టమైన విధానాలతో, రైతాంగ సంక్షేమం పట్ల చిత్తశుద్ధితో అమలు చేసిన పథకాలు నేడు సత్ఫలి తాలు అందించాయి.  

అయితే, వాస్తవాలు చూడలేకపోతున్న ప్రతిపక్ష తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రదేశ్‌లో వ్యవసాయమే కనుమరుగై పోయింద.ని ప్రచారం చేస్తున్నారు. వాస్తవాలకు మసిపూసి మారేడు కాయ చేయడం ఆయనకు కొత్తకాదు. నిజానికి, వ్యవ సాయరంగం గురించి మాట్లాడేందుకు చంద్రబాబుకు నైతిక హక్కు లేదు. మొత్తం 14 సంవత్సరాలపాటు సీఎంగా ఉన్న చంద్రబాబు వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేశారన్నది జగద్విదితం. చంద్రబాబు పాలనంటే రైతు లకు కంటిమీద కునుకు కరువవుతుంది.  వ్యవ సాయ రంగాన్ని వ్యూహాత్మకంగా దెబ్బతీసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన పాలనలో వ్యవసాయ రంగంలో తీసుకున్న రైతాంగ వ్యతిరేక చర్యలే ఇందుకు నిదర్శనం. 

కరువు కారణంగా విద్యుత్‌ బిల్లులు చెల్లించలేని రైతాంగంపై కేసులు బనాయించడం, రైతుల చేతులకు బేడీలు వేయడం,  వ్యవసాయరంగంలో ఉచిత విద్యుత్‌ ఇస్తే.. కరెంట్‌ తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని అడ్డగోలుగా వాదించడం, భారీగా పెంచిన విద్యుత్‌ చార్జీల్ని తగ్గించాలని ఉద్యమించిన వారిపై పోలీసులతో కాల్పులు జరిపించి, గుర్రాలతో తొక్కించి నాలుగు నిండు ప్రాణాల్ని పొట్టన పెట్టుకోవడం, వ్యవసాయ రంగం నుండి సేవల రంగానికి మరలాలంటూ రైతాంగానికి ఉచిత సలహాలివ్వడం, రాజధాని పేరుతో అమరావతి ప్రాంతంలో ఏడాదికి 34 పంటలు పండే బంగారం లాంటి భూముల్ని 32,000 ఎకరాలు తీసుకొని... వాటిని సాగుకు పనికి రాకుండా నాశనం చేయడం... ఇలా ఎన్నో రైతు వ్యతిరేక, వ్యవసాయ వ్యతిరేక చర్యలకు చంద్ర బాబు ఒడిగట్టారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడికి రైతుల మీద ఎక్కడలేని ప్రేమ పుట్టు కొస్తుంది. రైతాంగాన్ని రెచ్చగొట్టాలని అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. ఆ కోవలోనే ఇపుడు కూడా రాష్ట్రంలో అసలు వ్యవసాయరంగమే అదృశ్యం అయిందంటూ విపరీత అర్థాలతో అభూతకల్పనలు మాట్లాడు తున్నారు. ఇంతకంటే హాస్యాస్పదం ఏముంటుంది?

2019 మేలో అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  వ్యవసాయ రంగంలో చేపట్టిన చర్యలు వ్యవసాయ రంగ అభివృద్ధిని పరుగులు పెట్టించింది. ‘వైఎస్సార్‌  రైతు భరోసా’ పథకం ద్వారా రైతాంగానికి పంట వేసుకొనే ముందే పెట్టుబడి అందజేసి, దానికి పీఎం కిసాన్‌ పథకం జోడించారు. రైతు భరోసా కేంద్రాల నిర్వహణ, బలోపేతానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం, వైఎస్సార్‌ సున్నా వడ్డీ రుణాలు, వ్యవసాయ రంగానికి 9 గంటలపాటు ఉచిత విద్యుత్, విత్తన రాయితీ, ప్రతి జిల్లాలో ‘వైఎస్సార్‌ రైతు భవనాల’ నిర్మాణం వంటి అనేక పథకాలు ప్రవేశపెట్టారు.

ముఖ్యంగా గ్రామ సచివాలయాలకు అను బంధంగా ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు అందించడం, వ్యవసాయ నిపుణులతో పంటల సాగులో సలహాలు ఇప్పించడం, పంటలకు గిట్టుబాటు ధరలు దక్కేలా చర్యలు తీసు కోవడం; ఆర్‌బీకేలు రైతులకు కావాల్సిన బ్యాంకింగ్‌ సేవలు అందించడం, ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఏ సీజన్‌లో పంట నష్టపోతే అదే సీజన్‌లో ఇన్‌పుట్‌ సబ్సిడీని అందజేసి రైతులకు దన్నుగా నిలబడటం, అమూల్‌ సంస్థ ద్వారా పాడి రైతులకు మెరు గైన ధర దక్కేలా చేయడం; వ్యవసాయ అనుబంధ రంగాలైన మత్స్యశాఖ, పశు సంవర్ధకశాఖ, ఉద్యానశాఖ, పట్టుపరిశ్రమ వంటివాటిని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచడం వంటి అనేక విప్లవాత్మక చర్యలు ఆంధ్ర ప్రదేశ్‌లో వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కడానికి కారణమయ్యాయి.

ఈ 33 నెలల కాలంలో రాష్ట్రంలో వ్యవసాయ, ఇతర అనుబంధ రంగాల కోసం సుమారు రూ. 1.10 లక్షల కోట్లు ఖర్చు చేసింది జగన్‌ ప్రభుత్వం. అంకెలు అబ ద్ధాలు చెప్పవు. అవార్డులు ఊరికే రావు. ఈ వాస్తవాల్ని చంద్రబాబు గ్రహించినా రాజకీయ లబ్ధి కోసం తనదైన శైలిలో దుష్ప్రచారం చేస్తున్నారు. అయితే,  క్షేత్రస్థాయిలో రైతాంగాన్ని సంతృప్తిపర్చడం, వ్యవసాయాన్ని లాభ సాటి వృత్తిగా మలచడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి అనుగుణంగా ఫలితాలు అందు తున్నాయి. సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి పరిపాలనలో వ్యవసాయ రంగంలో నేడు నిశ్శబ్ద విప్లవం చోటు చేసుకొంది.

- డాక్టర్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు 
ఏపీ శాసన మండలి సభ్యులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement