మార్టూరు: ఇటీవల విడుదలైన సివిల్స్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 311వ ర్యాంకు సాధించిన మార్టూరుకు చెందిన వీరగంధం లక్ష్మీసుజితను శుక్రవారం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. సివిల్స్ ఫలితాల్లో రాష్ట్రంలో మెరుగైన ఫలితాలు సాధించిన ఉత్తమ ర్యాంకర్లను తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అభినందించారు. ఆమె వెంట తల్లిదండ్రులు మార్టూరు శ్రీనివాస విద్యాసంస్థల అధినేత వీరగంధం శ్రీనివాసరావు, భవానీ ఉన్నారు.
377 మంది
ఉపాధ్యాయులకు పోస్టింగ్స్
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 377 మంది ఉపాధ్యాయులు పోస్టింగ్స్ పొందారు. 1998, 2008 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులను ప్రభుత్వం ఇటీవల మినిమం టైం స్కేల్ (ఎంటీఎస్) పద్ధతిపై ఉపాధ్యాయులుగా నియమించిన విషయం తెలిసిందే. తాజాగా వారికి ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలల్లో పోస్టింగ్స్ ఇచ్చారు. శుక్రవారం పాత బస్టాండ్ సెంటర్లోని జిల్లా పరీక్ష భవన్‌లో డీఈఓ పి.శైలజ పర్యవేక్షణలో కౌన్సెలింగ్ జరిగింది. 227 మంది 98 డీఎస్సీ, 150 మంది 2008 డీఎస్సీ అభ్యర్థులకు పాఠశాలలను కేటాయించారు.
యార్డులో 30,012 బస్తాల మిర్చి విక్రయం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు శుక్రవారం 26,331 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 30,012 బస్తాల అమ్మకాలు జరిగాయి.
● నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల మిర్చి సగటు ధర రూ.9,500 నుంచి రూ.24 వేలు పలికింది.
● నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.9 వేలు నుంచి రూ.25 వేలు పలికింది.
● ఏసీ కామన్ రకం మిర్చి క్వింటాలుకు రూ.16,500 నుంచి 22 వేలు ధర లభించింది.
● ఏసీ ప్రత్యేక రకాల మిర్చికి రూ. 11,500 నుంచి రూ. 24,500 వరకు ధర పలికింది.
● తాలు రకం మిర్చికి రూ.6 వేలు నుంచి రూ.14 వేలు ధర లభించింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 12,358 బస్తాలు మిర్చి నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఐ.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.
నిమ్మకాయల ధరలు
తెనాలిటౌన్: గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయల కనిష్ట ధర రూ.900, గరిష్ట ధర రూ.2,000, మోడల్ ధర రూ.1,400 వరకు పలికింది.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 520.00 అడుగుల వద్ద ఉంది. జలాశయం నుంచి ఎస్‌ఎల్‌బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్‌కు 900 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 808.60 అడుగుల వద్ద ఉంది.


