గుంటూరు వెస్ట్ (క్రీడలు): జిమ్నాస్టిక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులుగా ఆర్‌పీఆర్ విఠల్, ఎన్.సుబ్బారావులు ఎన్నికయ్యారని ఎన్నికల నిర్వహణ అఽధికారి ఎన్.సందీప్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యక్షులుగా ఎన్.శ్రీనివాసరెడ్డి, షేక్ షాజియా తారాసుమ్, ఎం.విశ్వేశ్వరరావు, కోశాధికారిగా ఎస్‌వీ శివప్రసాద్‌తోపాటు ఆరుగురు కార్యనిర్వాహక సభ్యులుగా ఎన్నికయ్యారన్నారు. ఎన్నికలు స్థానిక బీఆర్ స్టేడియంలో నిర్వహించామన్నారు. ఎన్నికల పరిశీలకునిగా ఒలింపిక్ అసోసియేషన్ నుంచి బడేటి వెంకటరామయ్య వ్యవహరించారన్నారు. చీఫ్ కోచ్ జి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారని చెప్పారు.
ప్రకృతి వ్యవసాయంపై ఫ్రాన్స్ విద్యార్థుల అధ్యయనం
తాడేపల్లిరూరల్: ప్రకృతి వ్యవసాయంపై అధ్యయనం చేసేందుకు ఫ్రాన్స్ విద్యార్థులు సోమవారం కుంచనపల్లి విచ్చేశారు. ఎంటీఎంసీ పరిధిలోని కుంచనపల్లిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల వద్ద నుంచి వారి అనుభవాలను తెలుసుకున్నారు. అనంతరం పెనుమాక గ్రామంలోని రైతు భరోసా కేంద్రానికి వెళ్లారు. ఈ సందర్భంగా డీపీఎం కె.రాజకుమారి రైతులతో సమావేశం నిర్వహించారు. ఫ్రాన్స్ విద్యార్థులకు ప్రకృతి వ్యవసాయానికి, రసాయన వ్యవసాయానికి మధ్య ఉన్న తేడాలను, ఆదాయ, వ్యయాలను వివరించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా ఉత్పత్తులలో నాణ్యత, నిల్వసామర్ధ్యం తేడాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఎంయు అధితి, గ్రామీణ వ్యవసాయ అధికారి సాయికృష్ణ, సుమ, రహేల్ పాల్గొన్నారు.
యార్డుకు 41,735 బస్తాల మిర్చి రాక
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు సోమవారం 41,735 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 39,273 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నెంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల మిర్చి సగటు ధర రూ.10,000 నుంచి రూ.23,800 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగి, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.9,000 నుంచి రూ.26,000 వరకు పలికింది. ఏసీ కామన్ రకం మిర్చి క్వింటాలుకు రూ.10,000 నుంచి 23,500 వరకు ధర లభించింది. ఏసీ ప్రత్యేక రకాల మిర్చికి రూ.10,000 నుంచి రూ. 26,000 వరకు ధర పలికింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.14,000 వరకు ధర లభించింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 14,234 బస్తాలు మిర్చి నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఐ.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.
సాగర్ నీటిమట్టం వివరాలు
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 519.20 అడుగుల వద్ద ఉంది. ఇది 147.8214 టీఎంసీలకు సమానంగా ఉంది. సాగర్ జలాశయం నుంచి ఎస్‌ఎల్‌బీసీకి 1,350 క్యూసెక్కులు విడుదలవుతోంది. దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లోగా 1,350 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్ జలాశయానికి 1,350 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 808.90 అడుగుల వద్ద ఉంది. ఇది 32.6709 టీఎంసీలకు సమానం.


