నెల్లూరు(క్రైమ్): మూత్ర విసర్జనకు పట్టాల మీద నడుచుకుంటూ వెళ్తున్న తల్లీకూతుళ్లు రైలు ఢీకొనడంతో మృతి చెందారు. ఈ హృదయ విదారక ఘటన ఆత్మకూరు బస్టాండు సమీపంలో రైలు పట్టాలపై ఆదివారం సాయంత్రం జరిగింది. రైల్వే పోలీసుల సమాచారం మేరకు..
గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన ఫాతిమా అలియాస్ ఫాతిమున్నీసా(60)కు ఇద్దరు కుమార్తెలు. ఇద్దరికీ వివాహమైంది. పెద్ద కుమార్తె మెహరున్నీసా శింగరాయకొండ, చిన్నకుమార్తె గౌసియా(35) కందుకూరులో ఉంటున్నారు. రొట్టెల పండగకు తల్లీకూతుళ్లు కలిసి ఆదివారం పినాకిని ఎక్స్‌ప్రెస్‌లో నెల్లూరుకొచ్చారు. దర్గాను సందర్శించుకుని హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో తిరిగి తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్‌కు వచ్చారు. ఈ క్రమంలో మెహరున్నీసా రైల్వేస్టేషన్‌లో ఉండగా ఫాతిమున్నీసా, గౌసియా మూత్రవిసర్జన చేసేందుకు రైలుపట్టాల వెంబడి ఆత్మకూరు బస్టాండ్ వైపు వెళ్లారు. రైల్వే బ్రిడ్జి సమీపంలోకి వచ్చేసరికి నిజాముద్దీన్ వెళ్తున్న రైలు వారిని ఢీకొంది.
ఫాతిమున్నీసా అక్కడికక్కడే మృతి చెందగా గౌసియా రోడ్డుపై పడడంతో తలకు తీవ్రగాయమైంది. గాయాలపాలైన ఆమెను స్థానికులు 108 సాయంతో చికిత్స నిమిత్తం నెల్లూరు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గౌసియా మృతి చెందింది. తల్లి, చెల్లెలు మృతితో మెహరున్నీసా కన్నీటిపర్యంతమై అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఘటనా స్థలాన్ని రైల్వే ఎస్సై ఎన్.హరిచందన పరిశీలించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు నెల్లూరుకు బయలు దేరారు. పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.
పికెట్ ఏర్పాటు
గతంలోనూ ఇదే ప్రాంతంలో ఈ తరహా ఘటనలు చోటుచేసుకున్నాయి. రైల్వే పోలీసులు గస్తీని ఏర్పాటు చేసి అటువైపు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేస్తున్నా.. ప్రయాణికులు పెడచెవిన పెట్టి రైలు పట్టాలపై రాకపోకలు సాగిస్తూనే ఉన్నారు. ఆదివారం తల్లీకూతుళ్లు రైలుపట్టాలపై వెళుతుండగా, అటుగా వెళుతున్న వారు వారిస్తుండగానే రైలు వారిని ఢీకొంది. దీంతో రైల్వే పోలీసులు అక్కడ పికెట్‌ను ఏర్పాటు చేసి ప్రయాణికులు అటుగా వెళ్లకుండా చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment