
గుంటూరు : శిక్షణలో ఉన్న 11 మంది జూనియర్ సివిల్ న్యాయమూర్తులు బుధవారం జాయింట్ కలెక్టర్ జి.రాజకుమారిని కలిశారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లోని జేసీ చాంబర్‌లో సమావేశమైన ట్రైనీ న్యాయమూర్తులు రెవెన్యూ, పౌరసరఫరాలు, స్పందన, జగనన్నకు చెబుదాం, రికార్డు రూమ్ నిర్వహణ, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల విధి నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. జేసీ పలు అంశాలపై వారితో చర్చించారు. మారుతున్న కాలంలో ప్రజల అవసరాల నిమిత్తం రెవెన్యూ శాఖలో వస్తున్న వేగవంతమైన మార్పులను వివరించారు. న్యాయమూర్తులు పలు సందేహాలను నివృత్తి చేశారు.
సజావుగా పింఛన్ల పంపిణీ
నెహ్రూనగర్: వైఎస్సార్ పెన్షన్ కానుకను గుంటూరు జిల్లాలో బుధవారం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి వలంటీర్లు అందజేశారు. రెండో రోజు జిల్లాలో 92.70 శాతం పంపిణీ పూర్తయింది. జిల్లా వ్యాప్తంగా ఈ నెలలో 2,49,667 మంది లబ్ధిదారులు ఉండగా వారి కోసం ప్రభుత్వం రూ.68.59 కోట్లు కేటాయించింది. బుధవారం సాయంత్రానికి 2,31,430 మందికి నగదు అందజేశారు.
ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ
గుంటూరు ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా ముస్లిం, మైనార్టీ అభ్యర్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ కల్పిస్తున్నట్లు గుంటూరు–1, 2 ఉర్దూ అకాడమీ కంప్యూటర్ శిక్షణ కేంద్రాల ఇన్‌చార్జ్‌లు షేక్ మహిమున్నీసా, షేక్ కరీముద్దీన్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల మూడో వారంలో ప్రారంభం కానున్న డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ శిక్షణ కోసం ఈనెల 17వ తేదీలోపు ఆసక్తి గల అభ్యర్థులు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. టెన్త్‌లో ఉత్తీర్ణులై, ఉర్దూ భాషలో చదవడం, రాయడం వచ్చిన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. మూడు నెలల పాటు శిక్షణ పొందిన అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. గుంటూరు–1 పరిధిలో పాలాసుపత్రి వద్ద ఉన్న చిన్నబజారులోని అమీనా కాంప్లెక్స్‌లోని ఉర్దూ అకాడమీ శిక్షణ కేంద్రంలో నేరుగానూ, 85550 88516 సెల్ నంబర్లో సంప్రదించాలని తెలిపారు. అదే విధంగా గుంటూరు–2లో కృష్ణనగర్ రెండో లైనులోని శిక్షణ కేంద్రంలో 94940 42963 నంబర్లో సంప్రదించాలని సూచించారు.
యార్డులో 36,473 బస్తాల మిర్చి విక్రయం
కొరిటెపాడు(గుంటూరు)ః గుంటూరు మార్కెట్ యార్డుకు బుధవారం 33,985 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 36,473 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల మిర్చి సగటు ధర రూ.10 వేల నుంచి రూ.24 వేల వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.10 వేల నుంచి రూ.26 వేల వరకు లభించింది. ఏసీ కామన్ రకం క్వింటాలుకు రూ.10,500 నుంచి రూ.24 వేల వరకు పలికింది. ఏసీ ప్రత్యేక రకాల మిర్చికి రూ.10 వేల నుంచి 25,500 వరకు లభించింది. తాలు రకం మిర్చికి రూ.5 వేల నుంచి రూ.14 వేల వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 9,724 బస్తాల మిర్చి నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఐ.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.

