
హత్య కేసులో ముగ్గురు అరెస్టు
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని కేఎల్ రావు కాలనీలో గుర్తు తెలియని వ్యక్తిని కొట్టి చంపిన కేసులో తాడేపల్లి పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి ఆదివారం కోర్టుకు హాజరుపరిచారు. నార్త్‌జోన్ డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ఆదేశాల మేరకు సీఐ కల్యాణ్‌రాజు నేతృత్వంలో నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు. డీఎస్పీ కథనం ప్రకారం.. ఈనెల 27న గుర్తుతెలియని సుమారు 30 ఏళ్ల వయస్సు ఉన్న ఓ వ్యక్తి కేఎల్‌రావు కాలనీలోని హోసన్న ప్రార్థనా మందిరం వద్ద దుర్గాశి రాజేశ్వరి ఇంట్లోకి దూరి ఆమైపె అఘాయిత్యం చేయడానికి యత్నించాడు. రాజేశ్వరి బిగ్గరగా కేకలు వేయడంతో సమీపంలో ఉన్న వల్లభాపురం జశ్వంత్, వల్లభాపురం కోటేశ్వరరావు, బోజంగి సింహాచలం నాయుడు మరో ముగ్గురు ఆ వ్యక్తిని పట్టుకునేందుకు యత్నించారు. అయితే ఆ వ్యక్తి కొండపైకి పారిపోయాడు. దీంతో అతడిని వెంబడించి పట్టుకుని పిడిగుద్దులు కురిపించడంతో మరణించాడు. ఆ తర్వాత ఆ వ్యక్తిని రోడ్డుపైకి తీసుకొచ్చి పడేసి పారిపోయారు. దీనిపై కేసు నమోదు చేసిన తాడేపల్లి సీఐ కల్యాణ్‌రాజు ఎస్‌ఐ జె.శ్రీనివాసరావుతో కలిసి దర్యాప్తు చేశారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద తిరుగుతున్న వల్లభాపురం జశ్వంత్, వల్లభాపురం కోటేశ్వరరావు, బోజంగి సింహాచలం నాయుడును అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఈ హత్యలో పాలుపంచుకున్న మరో ముగ్గురు మైనర్లు అని తేలింది. వారినీ త్వరలోనే అరెస్టు చేస్తామని డీఎస్పీ తెలిపారు. అయితే చనిపోయిన వ్యక్తి ఎవరనేది ఇంకా నిర్ధారణ కాలేదు.