గుంటూరువెస్ట్: కలెక్టరేట్‌లోని లుంబిని వనంలో జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహ ఏర్పాటుకు బొమ్మిడాల భానుమూర్తి ట్రస్ట్ నిర్వహకులు జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డికి రూ.14 లక్షల చెక్కును అందజేశారు. స్థానిక కలెక్టరేట్‌లో శనివారం ఈ చెక్కు అందజేశారు. బొమ్మిడాల శ్రీమన్నారాయణ, బీవీఎస్‌కె రత్నం, డీఆర్వో చంద్రశేఖరరావు పాల్గొన్నారు.
బండారు వ్యాఖ్యలు
క్షమించరానివి
రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ డైరెక్టర్ గాదె సుజాత
నాదెండ్ల: సభ్య సమాజం తలదించుకునేలా మహిళలపై టీడీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయటం సిగ్గుచేటని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ డైరెక్టర్ గాదె సుజాత చెప్పారు. పల్నాడు జిల్లా చిరుమామిళ్ల గ్రామంలో జరుగుతున్న జగనన్న సురక్ష వైద్య క్యాంపును శనివారం ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి రోజాపై టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. గత టీడీపీ ప్రభుత్వ పాలనలో మహిళలపై లెక్కలేనని నేరాలు జరిగాయన్నారు. సాక్షాత్తూ మహిళా తహసీల్దార్‌నే వేధించి హింసించిన ఉదంతాన్ని ప్రజలు మరువలేదన్నారు. సీ్త్రలను ఉద్దేశించి బండారు మాట్లాడిన పదజాలం మహిళాలోకం అసహ్యించుకునేలా ఉన్నాయన్నారు. బండారు వ్యాఖ్యలు క్షమించరానివని, అతన్ని కఠినంగా శిక్షించాలన్నారు.
పెదకాకాని దర్గా ఆదాయం రూ.22.54 లక్షలు
పెదకాకాని: బాజీబాబా దర్గాలో హుండీ ద్వారా ఆదాయం గణనీయంగా పెరిగిందని వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్, దర్గా ఈఓ షేక్ ముక్తార్‌బాషా చెప్పారు. పెదకాకాని హజరత్ సయ్యద్ బాజీ షహీద్ అవులియా దర్గాలో రాష్ట్ర వక్ఫ్‌బోర్డు అధికారుల ఆదేశాల మేరకు శనివారం హుండీ తెరిచి కానుకలు లెక్కించారు. రాష్ట్ర వక్ఫ్‌బోర్డు డిప్యూటీ సెక్రటరీ, టీం ఇన్‌చార్జి షేక్ నూర్‌సాహెబ్ పర్యవేక్షణలో ఎటువంటి అవకతవకలు జరగకుండా వీడియో నిఘా, పోలీసు బందోబస్తుతో ప్రత్యేక చర్యలు చేపట్టారు. దర్గాలోని మొత్తం ఆరు హుండీల ద్వారా బాజీబాబా వారికి రూ.22,54,600 ఆదాయం లభించింది. ఉదయం 11 గంటల నుండి రాత్రి 9 గంటల వరకూ లెక్కింపు కొనసాగింది. కార్యక్రమంలో వక్ఫ్‌బోర్డు సూపరింటెండెంట్ సయ్యద్ రౌప్, రెవెన్యూ, పోలీసు, దర్గా సిబ్బంది, కెనరా బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 525.40 అడుగుల వద్ద ఉంది. జలాశయం నుంచి కుడి కాలువకు 4,459, ఎడమ కాలువకు 2,021 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 855.20 అడుగుల వద్ద ఉంది.


