యడ్లపాడు: జవహర్ నవోదయ విద్యాలయంలో 2024–25 విద్యాసంవత్సరానికి 9, 11వ తరగతుల్లో ప్రవేశానికి మంగళవారంతో గడువు ముగుస్తుందని పల్నాడు జిల్లా మద్దిరాల జేఎన్‌వీ ప్రిన్సిపాల్ ఎన్.నరసింహరావు తెలిపారు. ప్రస్తుతం 8వ తరగతి చదివే విద్యార్థులు 2009 మే 1 నుంచి 2011 జులై 31 మధ్య, అలాగే 10వ తరగతి వారు 2007 జూన్ 1 నుంచి 2009 జులై 31 మధ్య జన్మించిన వారై ఉండాలన్నారు. సాయంత్రం 5గంటలలోపు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను నమోదు చేసుకోవాలన్నారు.
ప్రత్తిపాడులో
9.2 మి.మీ వర్షం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు అత్యధికంగా ప్రత్తిపాడు మండలంలో 9.2 మిల్లీ మీటర్లు వర్షం పడగా, అత్యల్పంగా గుంటూరు తూర్పులో 0.6 మి.మీ వర్షం పడింది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. పొన్నూరు మండలంలో 6.6 మి.మీ., తెనాలి 6, దుగ్గిరాల 4.8, కొల్లిపర 3.4, చేబ్రోలు 1.2, వట్టిచెరుకూరు 1.2, గుంటూరు పశ్చిమ 1, మేడికొండూరు మండలంలో 0.8 మి.మీ చొప్పున వర్షం పడింది.
జీజీహెచ్‌కు సీటీ స్కాన్ మిషన్ మంజూరు
రూ.3.94 కోట్లతో కొనుగోలుకు అనుమతి
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్‌లో నూతనంగా 16 స్లైసెస్ సీటీ స్కాన్‌ను మంజూరు చేస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. నూతన సీటీ స్కాన్ మిషన్ కొనుగోలుకు రూ.3,94,23,000 నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డాక్టర్ వైఎస్సార్ హెల్త్ కేర్ ట్రస్ట్ రివాల్వింగ్ ఫండ్స్ ద్వారా సీటీ స్కాన్ మిషన్‌ను కొనుగోలు చేయాలంటూ ఉత్తర్వుల్లో వెల్లడించారు. జీజీహెచ్‌లో కొంతకాలంగా మిషన్ తరచూ మరమ్మతులకు గురవుతోంది. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏకుల కిరణ్‌కుమార్ సిటీస్కాన్ వైద్య పరికరం ఆవశ్యకతను వివరిస్తూ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డికి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినికి, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబుకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో తక్షణమే మంజూరుకు ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసి నిధులు సైతం ఇచ్చారు. అంతేకాకుండా పాత మిషన్ మరమ్మతులు చేయించేందుకు నిధులు మంజూరు చేసింది.
యార్డుకు 28,283
బస్తాల మిర్చి
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు సోమవారం 28,283 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 24,409 బస్తాల అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల మిర్చి సగటు ధర రూ.10,000 నుంచి రూ.23,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.10,000 నుంచి రూ.24,300 వరకు లభించింది. ఏసీ కామన్ రకం క్వింటాలుకు రూ.9,000 నుంచి రూ.23,800 వరకు పలికింది. ఏసీ ప్రత్యేక రకాల మిర్చికి రూ.11,700 నుంచి రూ.24,400 వరకు లభించింది. తాలు రకం మిర్చికి రూ.6,000 నుంచి రూ.14,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 12,537 బస్తాల మిర్చి నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఐ.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 524.80 అడుగుల వద్ద ఉంది. జలాశయం నుంచి ఎస్‌ఎల్‌బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం జలా శయం నీటిమట్టం 842.00 అడుగుల వద్ద ఉంది.
సాగునీటి సమాచారం
తాడేపల్లిరూరల్ (దుగ్గిరాల) : కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకు సీతానగరం వద్ద సోమవారం 4,610 క్యూసెక్కులు విడుదల చేశారు. హైలెవల్ కాలువకు 202, బ్యాంక్ కెనాల్‌కు 1,196, తూర్పు కెనాల్‌కు 565, పశ్చిమ కెనాల్‌కు 225, నిజాం పట్నం కాలువకు 340, కొమ్మమూరు కాల్వకు 2001 క్యూసెక్కులు విడుదల చేశారు.


