నగరంపాలెం: రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో పోలీస్ అధికారులు, సిబ్బందికి ఉత్తమ, సేవా పతకాలను ప్రకటిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో ఎంపిక చేసిన వారికి ఉగాది పండుగనాడు పతకాలను అందజేయనున్నారు. గుంటూరు రేంజ్ పరిధిలోని గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లాలలో నలుగురుకి ఉత్తమ, నాలుగు సేవా పతకాలు లభించాయి. ఇక సేవా పతకాలలో ఏఎస్‌ఐల నుంచి కానిస్టేబుళ్ల వరకు గుంటూరు –4, బాపట్ల– 3, పల్నాడు– 3, ప్రకాశం –4, ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లాలో ఐదుగురు అర్హత సాధించారు.
ఐలవరంలో శోభాయాత్ర
ఐలవరం(భట్టిప్రోలు): వివేకానంద విద్యా గ్రామీణాభివృద్ధి సంస్థ, (ఐలవరం) సమరసత సేవా ఫౌండేషన్ (ఎస్‌ఎస్‌ఎఫ్) సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ఐలవరంలో స్వామి వివేకానందుని జయంతి ఉత్సవాలు వేణుగోపాల స్వామి దేవస్థానంలో ఘనంగా నిర్వహించారు. పురవీధులలో వివేకానందునికి జై, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ శోభాయాత్ర చేశారు. కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు జంజనం హేమశంకరరావు, జెడ్పీటీసీ మాజీ సభ్యులు బండారు శ్రీనివాసరావు, జిల్లా దేవాలయాల ప్రముఖ్ పొన్నపల్లి సత్యనారాయణ, రేపల్లె ఖండ ప్రముఖ్ క్రాప రవికుమార్, ఎంపీటీసీ సభ్యులు మురుగుడు శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ అందె వెంకటేశ్వర్లు, నిర్వాహకులు పడమట వెంకటేశ్వరరావు, వి.కోటేశ్వరరావు, కె.బి.వి.రమణ తదితరులు పాల్గొన్నారు.
సంక్రాంతి సంబరాల కోసం కళాకారులు దరఖాస్తు చేసుకోండి
నరసరావుపేట: స్థానిక సత్తెనపల్లిరోడ్డులోని డీఎస్‌ఏ క్రీడా ప్రాంగణంలో ఈనెల 14వ తేదీ భోగి, 15న మకర సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వేడుకలలో భాగంగా ఔత్సాహిక కళాకారులు నృత్యం, పాటలు, సంగీతం తదితర వాటిలో వారి వారి ప్రతిభను చూపేందుకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. దరఖాస్తుదారులు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ.శామ్యూల్ 91827 17818, మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు 80742 76942 నంబర్లను సంప్రదించాలని కోరారు.
విద్యుత్ విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు
రూ. 6.20 లక్షలు అపరాధ రుసుం విధింపు
భట్టిప్రోలు: భట్టిప్రోలు విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం విద్యుత్ విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 70 బృందాలు గృహ, వాణిజ్య సర్వీసులను పరిశీలించారు. 5,588 సర్వీసులను తనిఖీ చేయగా వాటిలో 148 సర్వీసులు విద్యుత్ లోడు అధికంగా వినియోగిస్తున్నట్లు గుర్తించి రూ. 6.20 లక్షలు అపరాధ రుసుం విధించినట్లు వివరించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ విజిలెన్స్ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (గుంటూరు) పీవీ మల్లికార్జునరావు మాట్లాడుతూ విద్యుత్ చౌర్యం సామాజిక నేరమని అటువంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ తనిఖీలలో రేపల్లె డీఈఈ నెమలికంటి భాస్కరరావు, భట్టిప్రోలు ఏఈఈ పెరవలి ఏడుకొండలు, తెనాలి డివిజన్ పరిధిలోని విద్యుత్‌శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు
పట్నంబజారు : సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు టికెట్లు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని డీటీసీ షేక్ కరీం చెప్పారు. కాంట్రాక్టు గ్యారేజీ బస్సులకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే నిబంధనలు ఉల్లంఘించిన 49 బస్సులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


