కన్నడ కస్తూరి.. పతకాలపై గురి | - | Sakshi
Sakshi News home page

కన్నడ కస్తూరి.. పతకాలపై గురి

Published Sat, Aug 3 2024 2:46 AM | Last Updated on Sat, Aug 3 2024 1:47 PM

-

జావెలిన్‌ త్రోలో రష్మి అద్భుతాలు 

జాతీయస్థాయిలో పతకాల సాధన

 క్రీడల కోసమే భార్యాభర్తలు అంకితం

 ఏషియన్‌ గేమ్స్‌లో పతకం కోసం సాధన

2017లో సీనియర్‌ నేషనల్స్‌ సమయంలో దుర్గారావుకు, రష్మికి పరిచయం ఏర్పడింది. దుర్గారావు డిస్కస్‌ త్రోయర్‌. ఆ పరిచయం ప్రేమగా మారింది. 2020లో వివాహం చేసుకున్నారు. అదే ఏడాది రష్మికి రైల్వేలో టీటీ ఉద్యోగం వచ్చింది. అంతకు ముందే దుర్గారావు కూడా క్రీడా కోటాలో టీటీ ఉద్యోగం సాధించారు. ఇద్దరూ క్రీడాకారులవడంతో వాటి ప్రాముఖ్యత బాగా తెలుసు. అందుకే దుర్గారావు ఉద్యోగం చేస్తూ భార్య రష్మికి సహకారంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఆమె జాతీయ క్రీడా క్యాంప్‌లో శిక్షణ తీసుకుంటున్నారు.

గుంటూరు వెస్ట్‌ (క్రీడలు): కన్నడ నాట జన్మించిన రష్మి గుంటూరు కోడలు అయింది. పట్టణానికి చెందిన దుర్గారావును ప్రేమ వివాహం చేసుకుంది. అథ్లెటిక్స్‌లో గత ఐదేళ్లుగా ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ అటు పుట్టినింటికి, ఇటు మెట్టినింటికి పేరు తెస్తోంది. భార్యాభర్తలిద్దరూ జాతీయ అథ్లెట్స్‌ మాత్రమే కాదు.. భారతీయ రైల్వేలో టీటీలుగా కొలువులు సాధించారు. క్రీడల కోసం ప్రస్తుతం బిడ్డల్ని కూడా వద్దనుకుని కఠోర శిక్షణలో మునిగిపోయింది రష్మి.

అద్భుత విజయాలు
రష్మి తన సోదరుడు అభిషేక్‌తోపాటు పాఠశాల టీటీ సహకారంతో అథ్లెట్‌గా మారింది. ఈ క్రమంలో జూనియర్‌ సీనియర్‌ విభాగాల్లో జాతీయ స్థాయిలో డజన్ల కొద్దీ బంగారు, రజత, కాంస్య పతకాలు కై వసం చేసుకుంది. సీనియర్స్‌ విభాగంలో ఈ ఏడాది నిలకడైన ప్రతిభతో రెండు బంగారు, ఒక కాంస్య పతకం సాధించింది. ఆంధ్రా తరఫున అద్భుతమైన ప్రతిభతో ముందుకు వెళుతోంది. భర్త దుర్గారావు అన్ని విధాలుగా సహాయ, సహకారాలందిస్తున్నారు.

స్పాన్సర్‌ కావాలి
రష్మి శిక్షణ, డైట్‌ అన్నీ కలుపుకుని నెలకు కనీసం రూ.50 నుంచి రూ.70 వేలు అవసరమవుతుంది. దీంతోపాటు పోటీలకు కోచ్‌తో వెళ్లాలి. భర్త దుర్గారావు జీతం మొత్తం రష్మికే ఖర్చు చేస్తున్నారు. ఆమెకు వచ్చే జీతంలో సగం ఇంటికి వాడుతున్నారు. ఒక్క జావెలిన్‌ ఖరీదు రూ.2 లక్షలు ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే మరింత మెరుగైన సదుపాయాలు, క్రీడా సామగ్రి అవసరం. స్పాన్సర్‌ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది సౌత్‌ ఏషియన్‌ కంట్రీస్‌ క్రీడా పోటీలే లక్ష్యంగా రష్మి సాధన చేస్తోంది.

పెళ్లికి దారితీసిన పరిచయం 
2017లో సీనియర్‌ నేషనల్స్‌ సమయంలో దుర్గారావుకు, రష్మికి పరిచయం ఏర్పడింది. దుర్గారావు డిస్కస్‌ త్రోయర్‌. ఆ పరిచయం ప్రేమగా మారింది. 2020లో వివాహం చేసుకున్నారు. అదే ఏడాది రష్మికి రైల్వేలో టీటీ ఉద్యోగం వచ్చింది. అంతకు ముందే దుర్గారావు కూడా క్రీడా కోటాలో టీటీ ఉద్యోగం సాధించారు.  ఇద్దరూ క్రీడాకారులవడంతో వాటి ప్రాముఖ్యత బాగా తెలుసు. అందుకే దుర్గారావు ఉద్యోగం చేస్తూ భార్య రషి్మకి సహకారంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఆమె జాతీయ క్రీడా క్యాంప్‌లో శిక్షణ తీసుకుంటున్నారు.    

భారత్‌కు పతకాలు తేవడం లక్ష్యం
చిన్న నాటి నాకు ఆటలంటే ప్రాణం. మన దేశానికి క్రీడల్లో పతకాలు సాధించాలనేదే నా ఆకాంక్ష. గత నాలుగేళ్ల నుంచి దాదాపు కుటుంబానికి కూడా దూరంగా ఉంటూ సాధన చేస్తున్నాను. ఈ క్రమంలో మెరుగైన ప్రతిభతో జాతీయ స్థాయి పతకాలు సాధిస్తున్నా. అత్యుత్తమ కోచ్‌ రాజేంద్రసింగ్‌ సారథ్యంలో ప్రస్తుతం జాతీయ శిక్షణ తీసుకుంటున్నా. భర్త దుర్గారావు సహాయ, సహకారాలు ఎంత చెప్పినా తక్కువే. ఆయన కూడా క్రీడాకారుడు కావడంతో ఎంతో ప్రోత్సాహం లభిస్తోంది. అనుక్షణం నావెంట ఉండి నడిపిస్తున్నారు. నా సోదరుడి ప్రోత్సాహం కూడా ఎపుడూ నన్ను ముందుకు నడిపిస్తోంది. ఏషియన్‌ గేమ్స్‌లో పకతం సాధించడమే లక్ష్యం. స్పాన్సర్స్‌ లభిస్తే మరింత సౌలభ్యంగా ఉంటుంది. శిక్షణ సమయంలో చాలా ఖర్చు అవుతోంది.
– కె.రష్మి, జాతీయ స్థాయి జావెలిన్‌ త్రోయర్‌

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement