ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం
● మార్చి 1 నుంచి ఫస్ట్ ఇంటర్ పరీక్షలు ● మార్చి 3 నుంచి సెకండియర్.. ● గుంటూరు జిల్లాలో 87 కేంద్రాల్లో నిర్వహణ ● హాజరుకానున్న 71,258 మంది విద్యార్థులు ● ఉదయం 9 గంటల తర్వాత నో ఎంట్రీ
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలకు గుంటూరు జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా వ్యాప్తంగా హాజరు కానున్న 71,528 మంది విద్యార్థుల కోసం 87 పరీక్ష కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. మార్చి ఒకటో తేదీన ప్రారభం కానున్న ప్రథమ సంవత్సర పరీక్షలకు 35,688 మంది, మార్చి 3వ తేదీన ప్రారంభం కానున్న ద్వితీయ సంవత్సర పరీక్షలకు 35,946 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనుండగా, విద్యార్థులను 8.30 గంటల నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. దూర ప్రాంతాల్లోని కేంద్రాలకు చేరుకోవడంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఉదయం 8 గంటల కల్లా విద్యార్థులు కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 8.45 గంటలలోపల ఎట్టి పరిస్థితుల్లో పరీక్ష కేంద్రంలో తమకు కేటాయించిన సీటులో కూర్చోవాలని, 9 గంటల తరువాత అనుమతించబోమని ఆర్‌ఐవో జీకే జుబేర్ స్పష్టం చేశారు.
వాట్సాప్ చేస్తే హాల్‌టికెట్
పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులందరికీ హాల్ టికెట్లు జారీ చేసిన ఇంటర్‌బోర్డు హాజరు నిబంధనలతో ముడిపెట్టకుండా విద్యార్ధులందరికీ పరీక్ష రాసే అవకాశాన్ని కల్పించింది. అదే విధంగా ఫీజు బకాయిల పేరుతో కళాశాలల యాజమాన్యాలు హాల్ టికెట్లు ఇవ్వకుండా వేధింపులకు పాల్పడుతున్నాయనే ఫిర్యాదులతో ఇంటర్‌బోర్డు సైట్‌తో పాటు ప్రభుత్వ సేవల వాట్సాప్ నంబరు నుంచి హాల్ టికెట్లు పొందే అవకాశం కల్పించారు. అదే విధంగా హాల్ టికెట్లపై సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన 95523 00009 నంబరుకు వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ చేసి విద్యాసేవలను ఎంపిక చేసుకుని విద్యార్థి రోల్ నంబరు, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి హాల్ టిక్కెట్ పొందవచ్చు. దీనిని ప్రింట్ తీసుకుని, నేరుగా పరీక్ష రాసేందుకు వెళ్లవచ్చు. జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పరీక్షల సరళిని ఆర్‌ఐవో కార్యాలయంతోపాటు ఇంటర్‌బోర్డు నుంచి ప్రత్యక్షంగా పరిశీలించే ఏర్పాట్లు చేశారు.
నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్‌లు
పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమలు పరుస్తుండగా, మాల్ ప్రాక్టీసులను నిరోధించేందుకు నాలుగు ఫ్లయింగ్, నాలుగు సిట్టింగ్ స్క్వాడ్స్‌ను ఏర్పాటు చేశారు. ప్రశ్నపత్రాలకు బార్ కోడింగ్ విధానం ఉండటంతో ఎక్కడైనా మాల్ ప్రాక్టీసు, కాపీయింగ్ వంటి ఘటనలు జరిగితే అందుకు బాధ్యులైన వారిని గుర్తించడంతోపాటు కఠిన చర్యలు తీసుకునేందుకు ఇంటర్మీడియెట్ బోర్డు పక్కాగా ఏర్పాట్లు చేసింది. మాల్ ప్రాక్టీసు, కాపీయింగ్ వంటి దుశ్చర్యలకు పాల్పడటం ద్వారా క్రిమినల్ చర్యలతో పరీక్షల నుంచి ఐదేళ్లపాటు డీబార్ అయ్యే పరిస్థితులు తెచ్చుకోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. పరీక్షలకు సంబంధించిన సమస్యలు, సందేహాల నివృత్తికి ఆర్‌ఐవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నంబరు 0863–2228528కు ఫోన్ చేయొచ్చని అధికారులు చెప్పారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన అత్యున్నతస్థాయి కమిటీ ఆధ్వర్యంలో పోలీసు, రెవిన్యూ యంత్రాంగం పరీక్షలను పర్యవేక్షిస్తోంది.
సందేహాల నివృత్తికి ఫోన్ చేయండి
ఆర్‌ఐఓ కార్యాలయ కంట్రోల్ రూం : 0863-2228528
హాల్‌టికెట్ కోసం వాట్సాప్ నంబర్ : 95523 00009
Comments
Please login to add a commentAdd a comment