సాక్షి ప్రతినిధి, గుంటూరు: కృష్ణా – గుంటూరు జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల పోలింగ్ మరికొద్ది సేపటిలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. కృష్ణా – గుంటూరు జిల్లాల్లో మొత్తం ఓటర్లు 3,47,116 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 25 మంది పోటీలో ఉన్నారు.
ఇద్దరి మధ్యే ప్రధాన పోటీ
ప్రధాన పోటీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా, పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావుల మధ్య ఉండనుంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆలపాటి రాజా వ్యూహాలు పన్నినా.. కూటమిలోని ఇతర పక్షాలు సహకరించకపోవడం ఆయనకు మింగుడుపడని అంశం. మరోవైపు కేఎస్ లక్ష్మణరావుకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది.
పటిష్ట ఏర్పాట్లు
రెండు జిల్లాల్లోనూ 483 పోలింగ్ కేంద్రాలలో అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఓ మైక్రో అబ్జర్వర్‌ను నియమించారు. వెబ్‌కాస్టింగ్, విడియోగ్రఫీ చేయనున్నారు. 140 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది.
గుర్తింపు కార్డు తప్పనిసరి
ఓటేసేందుకు వెళ్లే పట్టభద్రులు ఎన్నికల సంఘం నిర్దేశించిన పది గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి కలిగి ఉండాలి. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు, విద్యాసంస్థల ఉద్యోగుల గుర్తింపు కార్డు, ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు, విభిన్న ప్రతిభావంతులకు జారీ చేసిన గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి వెంట తీసుకెళ్లాలి. పోలింగ్ కేంద్రాలలోకి సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు.
పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం నిషేధం
ఓటర్లకు పోలింగ్ బూత్ వివరాలను తెలియచేయటానికి ప్రతి తహసీల్దార్ కార్యాలయంలోనూ ఉద్యోగులు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశారు. పోలింగ్ రోజు అభ్యర్థులు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదని ఎన్నికల సంఘం ఆదేశించింది. అయితే కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా వర్గీయులు ఈ నిబంధనను ఉల్లంఘిస్తున్నారని పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు ఎన్నికల ఏజెంట్ ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఓటరు సహాయ కేంద్రాల పేరుతో పోలింగ్ కేంద్రాల వద్ద భారీ టెంట్లు వేసి ల్యాప్‌టాప్‌లతో కూర్చుని ఆలపాటి పేరు, ఫొటో, బ్యాలెట్ ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు.
పకడ్బందీగా పోలింగ్ నిర్వహణ : కలెక్టర్
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పకడ్బందీగా నిర్వహిస్తామని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. బుధవారం ఏసీ కళాశాలలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో పోలింగ్ మెటీరియల్ పంపిణీని ఆమె పర్యవేక్షించారు. అనంతరం కలెక్టర్ విలేకరులతో మాట్లాడారు. పోలింగ్ సిబ్బంది పారదర్శకంగా పనిచేయాలని సూచించారు. ఓటర్లకు ఇప్పటికే 95శాతం ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తయినట్టు వెల్లడించారు.
పోలింగ్‌కు సర్వం సిద్ధం నేడు 493 కేంద్రాల్లో ఓటింగ్ కృష్ణా – గుంటూరు జిల్లాల్లో 3,47,116 మంది ఓటర్లు ఎన్నికల సామగ్రి పంపిణీ పూర్తి
Comments
Please login to add a commentAdd a comment