జాతీయ రహదారి భూముల పరిశీలన
ఫిరంగిపురం: నేషనల్ హైవే అథారిటీ ఇండియా ఆదేశాల మేరకు వినుకొండ నుంచి గుంటూరు జాతీయ రహదారి నంబరు 544డీని నాలుగు లైన్లుగా విస్తరించేందుకు సేకరించే భూములను గురువారం జాయింట్ కలెక్టర్ భార్గవ్‌తేజ పరిశీలించారు. పొనుగుపాడు, మేరికపూడి, రేపూడి, నుదురుపాడు, వేమవరం, ఫిరంగిపురం, అమీనాబాద్ గ్రామాల్లోని భూములను చూసి రైతులతో మాట్లాడారు. సర్వే చేసే విషయం గురించి వారికి అవగాహన కల్పించారు. ఆయన వెంట తహసీల్దార్ జె.ప్రసాదరావు, సర్వేయర్ వెంకటేశ్వర్లు, ఆర్‌ఐ అబ్దుల్ రెహమాన్, ఆయాగ్రామాల వీఆర్వోలు, వీఆర్‌ఏలు, సర్వేయర్లు పాల్గొన్నారు.
మేడికొండూరు మండలంలో..
మేడికొండూరు: మండలంలోని డోకిపర్రు, మంగళగిరిపాడు, మేడికొండూరు ప్రాంతాల్లో నూ భూములను జేసీ పరిశీలించారు. రైతులతో అవగాహన సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మేడికొండూరు తహసీల్దార్ ఎం.హరిబాబు, మండల సర్వేయర్ కె.సాంబశివరావు పాల్గొన్నారు.
1,48,601 బస్తాల
మిర్చి విక్రయం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు గురువారం 1,42,015 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,48,601 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.14,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,500 నుంచి రూ.14,000 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.7,200 వరకు ధర పలికింది. యార్డులో ఇంకా 60,317 బస్తాలు నిల్వ ఉంది.