ఏఎన్‌యూ వీసీ గంగాధరరావు
గుంటూరు ఎడ్యుకేషన్: సాంకేతిక విజ్ఞానాన్ని సమాజ శ్రేయస్సు కోసం వినియోగించాలని ఏఎన్‌యూ వీసీ ఆచార్య కె.గంగాధరరావు పేర్కొన్నారు. జేకేసీ కళాశాలలో గురువారం కంప్యూటర్ రంగంలో నూతన అధునాతన పోకడలపై ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విజ్ఞానాన్ని, సాంకేతితను దుర్వినియోగపరచరాదని విద్యార్థులకు సూచించారు. గతంలో కంటే విజ్ఞానశాస్త్రం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. దీనిపై విద్యార్థులు, పరిశోధకులు దృష్టి సారిస్తే ఉత్తమ ఫలితాలు పొందవచ్చునని సూచించారు. కంప్యూటర్ సైన్సులో నాటి నుంచి ఇప్పటి వరకు చోటు చేసుకున్న అధునాతన దశల గురించి వివరించారు. విద్యాబోధన, అధ్యయనం సమాంతరంగా సాగాలని తెలిపారు. అధ్యాపకులు నిత్య విద్యార్థులుగా ఉండాలన్నారు. ఆధునిక బోధనా పద్ధతులను అందిపుచ్చుకుని విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించినప్పుడే మెరుగైన జ్ఞానాన్ని పొందుతారని సూచించారు. ఈ సందర్భంగా సదస్సు సావనీర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, పీజీ కోర్సుల డైరెక్టర్ ఎస్సార్కే ప్రసాద్, ప్రిన్సిపాల్ పి.గోపీచంద్, వైస్ ప్రిన్సిపాల్ కె.సాంబశివరావు, సదస్సు డైరెక్టర్ డాక్టర్ యలవర్తి సురేష్‌బాబు, డాక్టర్ వై. వెంకటేశ్వరరావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


