ప్రవేశపెట్టిన బ్యాంక్ సీఈఓ కృష్ణవేణి
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(జీడీసీసీబీ) మహాజన సభ సమావేశాన్ని బ్రాడీపేటలోని ప్రధాన కార్యాలయంలో ఆ బ్యాంక్ పర్సన్ ఇన్‌చార్జి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ అధ్యక్షతన గురువారం నిర్వహించారు. సీఈఓ టి.కృష్ణవేణి 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జమ, ఖర్చులు చదివి వినిపించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.46 కోట్లతో అంచనా బడ్జెట్‌ను సభ ముందుంచారు. దీన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతోపాటు పలు తీర్మానాలను ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా సీఈఓ కృష్ణవేణి మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రైతులకు ఇచ్చిన రుణాలను త్వరితగతిన వసూలు చేయాలని సూచించారు. 2024– 25లో జీడీసీసీ బ్యాంక్ రూ.25 కోట్లు లాభం ఆర్జించిందని ఆమె ప్రకటించారు. పీఏసీఎస్, జీడీసీసీ బ్యాంక్ బ్రాంచిల్లో ఎన్‌పీఏ తగ్గించాలని, రుణాల రికవరీలో అభ్యంతరాలు ఉంటే న్యాయపరంగా ముందుకు వెళ్లాలని సూచించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 167 పీఏసీఎస్‌ల్లో ఇప్పటి వరకు 127 సంఘాల్లో కంప్యూటరీకరణ పూర్తయిందని, మిగిలిన 40 సంఘాల్లో కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సీఈఓ కృష్ణవేణి అంచనా బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత జీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్‌చార్జి, జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ ‘ఎనీ అబ్జక్షన్స్’ అంటూ సభ్యులను వివరణ కోరారు. అభ్యంతరాలు ఏమీ లేవని చెప్పడంతో మహాజన సభ సమావేశాన్ని 10 నుంచి 15 నిమిషాల్లో ముగించి వేశారు. సమావేశంలో పీఏసీఎస్ పర్సన్ ఇన్‌చార్జిలు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
రూ.46 కోట్లతో జీడీసీసీబీ అంచనా బడ్జెట్


