లక్ష్మీపురం: విజయవాడ నుంచి సప్త (7) జ్యోతిర్లింగ దర్శనం చేసే భారత్ గౌవర్ టూరిస్ట్ రైలును ఏప్రిల్ 8వ తేదీనుంచి నడపనున్నట్లు ఐఆర్‌సీటీసీ ఏరియా మేనేజర్ ఎం.రాజా తెలిపారు. గుంటూరు రైల్వే స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్రలో ఉజ్జయిన్‌లో మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, ద్వారకలో నాగేశ్వర్, సోమనాథ్‌లో సోమనాథ్, పుణేలో భీమశంకర్, నాసిక్‌లో త్రయంబకేశ్వరుడు, ఔరంగబాద్‌లో గ్రిష్ణేశ్వర్‌ను చూడవచ్చని తెలిపారు. యాత్ర ఏప్రిల్ 8వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 11రాత్రులు, 12 రోజులు ఉంటుందని వివరించారు. రైలు విజయవాడ నుంచి, ఖమ్మం, కాజీపేట, సికింద్రబాద్ మీదుగా ప్రయాణిస్తుందని చెప్పారు. స్లీపర్ క్లాస్‌లో పెద్దలకు రూ.20,890, 5నుంచి 11 సంవత్సరాల చిన్నారులకురూ.19,555 చార్జీ ఉంటుందని పేర్కొన్నారు. రాత్రి హోటల్‌లో బస నాన్ ఏసీ, రవాణా నాన్ ఏసీ వాహనంలో ఉంటాయని తెలిపారు. త్రీ టైర్ ఏసీలో అయితే పెద్దలకు రూ.33,735, 5నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు రూ.32,160 చార్జీలు ఉంటాయన్నారు. హోటల్‌లో రాత్రి బస ఏసీ రూమ్, రవాణా నాన్ ఏసీ వాహనంలో ఉంటుందన్నారు. టూ టైర్ ఏసీలో అయితే పెద్దలకు రూ.44,375, 5నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు రూ.42,485తో పాటు ఏసీ హోటల్, రవాణా ఏసీ వాహనంలో ఉంటుందని తెలిపారు. అన్ని శాకాహార భోజనాలు, ఉదయం టీ, అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం, ప్రయాణికులకు బీమా, వృత్తిపరమైన, స్నేహపూర్వక పర్యటన ఎస్కార్ట్ సేవలు, రైలులో భద్రత, అవసరమైన సహాయం కోసం ఐఆర్‌సీటీసీ టూర్ మేనేజర్ అంతటా ప్రయాణిస్తారని పేర్కొన్నారు. అన్ని రకాల పన్నులు వర్తిస్తాయన్నారు. మరిన్ని వివరాల కోసం ఆన్‌లైన్ బుకింగ్ ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను చూడాలని సూచించారు. ఇతర వివరాలకు 9281495848, 9281030714 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. అనంతరం సప్తర్లింగ్ దర్శన యాత్ర బ్రోచర్‌ను ఆవిష్కరించారు.


