పర్సన్ ఇన్‌చార్జి, జేసీ భార్గవ్ తేజ
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లా కో–ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ(జీడీసీఎంఎస్)ను అన్ని రంగాల్లో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలపాలని పర్సన్ ఇన్‌చార్జి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ తెలిపారు. స్థానిక కన్నావారితోటలోని జీడీసీఎంఎస్ కార్యాలయంలో గురువారం జరిగిన మహాజన సభ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్)ను లాభాల్లో నడిపించాలని చెప్పారుఉ. ముందుగా బిజినెస్ మేనేజర్ డి.హరిగోపాలం 2025–26 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.6.21 కోట్లతో అంచనా బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2024–25లో జిల్లాలోని 44 జీడీసీఎంఎస్ బ్రాంచీలు, పలు పీఏసీఎస్‌ల ద్వారా రూ.81 కోట్లు విలువైన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, నోటు పుస్తకాలు, స్టేషనరీ, ప్రొవిజన్స్ తదితర వ్యాపారాలు చేసినట్లు పేర్కొన్నారు. 2024–25 ఖరీఫ్ సీజన్‌లో ఏపీ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోని 12 మండలాల్లో రూ.280 కోట్ల విలువ గల 1.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఏపీ మార్క్‌ఫెడ్, నాఫెడ్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లాలో కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రూ.19.19 కోట్ల విలువ గల 2,541 మెట్రిక్ టన్నులను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.2 కోట్లు లాభం ఆర్జించినట్లు ప్రకటించారు. రాబోయే రోజుల్లో మరిన్ని వ్యాపారాలు చేసి జీడీసీఎంఎస్‌ను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని ఆయన వెల్లడించారు. అనంతరం సమావేశంలో పలు తీర్మానాలు ప్రవేశపెట్టగా, సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. జేసీ భార్గవ్ తేజ పలు ఫైళ్లు, తీర్మానాలపై సంతకాలు చేశారు. సమావేశంలో జీడీసీఎంఎస్ కార్యాలయం మేనేజర్ కె.శ్రీనివాసరావు, పీఏసీఎస్‌ల పర్సన్ ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.


