ఎడ్ల పందేల్లో అపశ్రుతి
తెనాలి: స్థానిక మార్కెట్ యార్డులోని జరుగుతున్న ఆలపాటి శివరామకృష్ణయ్య జాతీయస్థాయి ఎడ్ల పందేల్లో మూడోరోజైన సోమవారం రాత్రి అపశ్రుతి చోటుచేసుకుంది. జిల్లాలోని సత్తెనపల్లి దగ్గర్లోని కొమెరపూడి గ్రామానికి చెందిన యర్రా వెంకటేశ్వరరావు పందెపు ఎడ్ల జత బండలాగుడు పోటీల్లో పాల్గొన్నపుడు ఒక ఎద్దుకు కాలుజారి ఫ్రాక్చర్ అయింది. అక్కడే ఉన్న పశుసంవర్ధకశాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ (జేడీఏ) డాక్టర్ ఒ.నరసింహారావు పర్యవేక్షణలో పశువైద్యులు పరిశీలించి ప్రాథమిక వైద్యం చేశారు.
● అత్యవసర శస్త్రచికిత్స కోసం గన్నవరంలోని పశువైద్య కళాశాలలోని సర్జరీ విభాగానికి తరలించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. మొబైల్ వెటరనరీ అంబులెన్స్ వాహనాన్ని రప్పించారు. తెనాలి వాహనంలో లిఫ్ట్ పనిచేయకపోవటంతో దుగ్గిరాల నుంచి 1962 మొబైల్ అంబులెన్స్‌ను పిలిపించారు. గాయపడిన ఎద్దును మొబైల్ వాహనంలోని లిఫ్ట్ సాయంతో అందులోకి ఎక్కించి, గన్నవరం తరలించారు.
● మనుషులకు 108 అంబులెన్స్ వాహనం తరహాలోనే పశువులకు ప్రమాదం జరిగినపుడు అత్యవసర వైద్యసేవల కోసమని గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 1962 మొబైల్ అంబులేటరీ వెటరనరీ వాహనాలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. గాయపడిన పశువుల వద్దకు నేరుగా వెళ్లి వైద్యం చేయటం, సాధ్యం కాకపోతే పశువును లిఫ్ట్ చేసి, ఆసుపత్రికి తరలించి వైద్యం చేసేందుకు వీటిని వినియోగిస్తున్నారు. ఇప్పుడు పొరుగు జిల్లాకు వెళ్లటం నిబంధనలకు విరుద్ధమైనా, పరిస్థితి తీవ్రతతో ఉన్నతాధికారులు, ఈఎంఆర్‌ఐను జేడీఏ డాక్టర్ నరసింహారావు ఫోనులో సంప్రదించి, వారి అనుమతితో తరలించారు. తెనాలి పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ బి.నాగిరెడ్డి, డాక్టర్ జి.నరేంద్ర, ఆలపాటి వెంకట్రామయ్య, సిబ్బంది సహకరించారు.
బండ్ల లాగుడు పోటీల్లో కాలుజారి పందెపు ఎద్దుకు ఫ్రాక్చర్ 1962 అంబులెన్స్ వాహనంలో గన్నవరం తరలింపు


