ట్రాన్స్‌ఫార్మర్ మార్చాలంటూ ధర్నా
ఫిరంగిపురం: మండలకేంద్రం ఫిరంగిపురంలోని ముస్లింపేట వద్దనున్న జెండాచెట్టు వద్ద గల విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌తో నానా ఇక్కట్లు పడుతున్నామని దానిని మార్చాలంటూ ముస్లింపేట వాసులు సోమవారం సాయంత్రం సొలస బస్టాండు వద్ద రోడ్డుపై బైఠాయించారు. సేకరించిన వివరాల ప్రకారం.. ముస్లింపేట వద్ద ట్రాన్స్‌ఫార్మర్ సరిలేని కారణంగా విద్యుత్ సరఫరాకు తరచూ అంతరాయం కలుగుతుందని తెలిపారు. రంజాన్ పండుగ కావడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో నానా ఇబ్బందులు పడ్డామని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత ట్రాన్స్‌ఫార్మర్ స్థానంలో కొత్తది ఏర్పాటుచేయాలని ఎన్నిసార్లు చెప్పినా ఆ శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొలస బస్టాండువద్ద గుంటూరు – కర్నూలు రాష్ట్ర రహదారిపై బైఠాయించడంతో ఇరువైపులా వాహనాలు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి స్థానికులతో మాట్లాడారు. అనంతరం విద్యుత్‌శాఖ అధికారులతో ఫోనులో మాట్లాడటంతో ప్రస్తుతం విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. మంగళవారం నూతన ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుచేసి విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చేస్తామని చెప్పడంతో ధర్నా విరమించారు.
పండుగనాడు విద్యుత్ లేదంటూ ఆగ్రహం ఫిరంగిపురం సొలస బస్టాండు వద్ద గుంటూరు– కర్నూలు రోడ్డుపై ధర్నా


