స్థలం లేక అల్లాడుతున్నాం!
తాడికొండ: రాజధానిలో ఈద్గాకు స్థలం లేక పదేళ్లుగా మైనార్టీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలాది ఎకరాలను పూలింగ్‌కు ఇచ్చిన ఈ ప్రాంతంలో ముస్లింలకు ఈద్గా స్థలం కావాలని అడుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూలింగ్ సమయంలో సీఆర్డీఏ భూములు తీసుకునేప్పుడు తమ పరిస్థితి వివరిస్తే ఈద్గాకు స్థలం కేటాయించడమే కాకుండా మసీదు నిర్మిస్తామని అధికారులు హామీ ఇచ్చారని, అయితే ఇప్పుడు పూర్తిగా విస్మరించారని ముస్లింలు చెబుతున్నారు. పవిత్ర రంజాన్ రోజున కూడా ప్రార్థనలు చేసుకునేందుకు జానెడు జాగా లేక రోడ్డుపైనే టెంట్‌లు వేసి ప్రార్థనలు చేయాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన చెందారు. ముస్లింలు అధికంగా ఉన్న రాయపూడి గ్రామంలో ఈద్గాకు స్థలం కేటాయించాలని పూలింగ్ సమయంలోనే నాటి ఎమ్మెల్యే, అధికారులు, సీఎంకు పలుమార్లు ముస్లింలు వినతిపత్రాలు అందజేశారు. అయితే ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. తెలుగుదేశం పార్టీని నమ్మి ఓట్లేస్తే గతంలోనూ, ఇప్పుడూ తమను నట్టేట ముంచారని, సమస్యను ఎమ్మెల్యేకి వివరిస్తే ఇదిగో పరిష్కారం చేస్తామని చెబుతున్నారని, సీఎం దృష్టికి తీసుకెళ్లిన దాఖలాలే కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.
రోడ్డుపైనే టెంట్ వేసి ప్రార్థనలు
రాజధానిలో మైనార్టీల ఆవేదన
ఈద్గాకు స్థలం కేటాయించాలని డిమాండ్
సర్కారుకు విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం
ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యం


