బాలికలపై నేరాలను నివారించాలి
గుంటూరు వెస్ట్ : జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, వసతి గృహాల్లో 18 ఏళ్లలోపు బాల, బాలికలపై నేరాలు నివారించేందుకు నిర్దేశించిన ముందస్తు భద్రతా రక్షణ చర్యలు పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లోని డీఆర్సీ సమావేశ మందిరంలో ఎస్పీ సతీష్‌కుమార్‌తో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యార్థుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. పాఠశాలలు, కళాశాలలు, హాస్పటల్స్, ప్రవేశ మార్గాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. తల్లిదండ్రులు కాకుండా, విద్యార్థుల కోసం వచ్చే ఇతర బంధువుల వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. విద్యా సంస్థలకు, వసతి గృహాలకు ప్రహరీలు నిర్మించడంతోపాటు, వాచ్‌మెన్‌లను తప్పక ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, హాస్టల్స్‌కు విద్యార్థులు వచ్చిన తరువాత తిరిగి వారు వారి ఇళ్లకు వెళ్లే వరకు పూర్తి బాధ్యత ప్రధానోపాధ్యాయులు, వార్డెన్లు వహించాలన్నారు. సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతుల సమస్యలు ఉంటే వాటిని ఆశాఖ వెంటనే పరిష్కరించాలని సూచించారు. జిల్లాలోని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ వద్ద భద్రత పెంచాలన్నారు. ఎస్పీ సతీష్‌కుమార్ మాట్లాడుతూ బాలికలపై నేరాలు నివారించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతోపాటు ప్రహరీలు నిర్మించడం, వాచ్‌మెన్లను నియమించడం చేయాలన్నారు. సమావేశంలో డీఆర్వో షేక్ ఖాజావలి, అడిషనల్ ఎస్పీ జి.వి.రమణమూర్తి, డీఎస్పీ సుబ్బారావు, ఆర్‌ఐఓ జి.కె.జుబేర్, జిల్లా వైద్య శాఖ అధికారి కె.విజయలక్ష్మి, ఈఓ టి.వి.రేణుక, ఐసీడీఎస్ పీడీ విజయలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.
ప్రైవేటు బస్సులకు రూట్ల కేటాయింపు పారదర్శకంగా జరగాలి
జిల్లాలో ఆరు రూట్లులో ప్రైవేటు బస్సులకు అనుమతులు పారదర్శకంగా ఇవ్వాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి చెప్పారు. బుధవారం కలెక్టరేట్‌లోని డీఆర్సీ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారి వై జంక్షన్– పెదపలకలూరు, ఆర్టీసీ బస్టాండ్– లాం, ఆర్టీసీ బస్టాండ్– అడవి తక్కెళ్ళపాడు, పాత గుంటూరు మణి హోటల్–ఆర్టీసీ బస్టాండ్, ఆర్టీసీ బస్టాండ్– ఇన్నర్ రింగ్ రోడ్డు మీదుగా రెడ్డిపాలెం, గుజ్జనగుండ్ల– గుండవరం వరకు మొత్తం 6 రూట్లకు 54 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. ఈ నెల 9లోగా ఆర్టీఏ అధికారులు వీటిపై సమీక్షించి పూర్తి వివరాలతో రిపోర్ట్ అందజేస్తే అనుమతులు మంజూరు చేస్తామని కలెక్టర్ వివరించారు. సమావేశంలో జిల్లా ఉప రవాణా కమీషనర్ సీతారామిరెడ్డి, ఆర్టీసీ ఆర్‌ఎం కృష్ణకాంత్, ట్రాఫిక్ డిఎస్సీ రమేషన్ పాల్గొన్నారు.
కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి


