నవ్యకేర్‌తో జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్ ఒప్పందం
గుంటూరు మెడికల్ : క్యాన్సర్ రోగులకు మెరుగైన, సత్వర వైద్య సేవలు అందించేందుకు గుంటూరు జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్ గురువారం నవ్య కేర్ నెట్‌వర్క్, నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ (ఆంధ్రప్రదేశ్ చాప్టర్)తో ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రులలో క్లినికల్ సామర్‌ాధ్యలను మెరుగుపరచడం, ఆధారిత చికిత్సా ప్రణాళికలు, వర్చువల్ మల్టీడిసిప్లినరీ ట్యూమర్ బోర్డ్‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు వర్చువల్‌గా ప్రాజెక్టును ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టాటా మెమోరియల్ సెంటర్, హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, విశాఖపట్నం మధ్య ఏర్పడిన భాగస్వామ్యంలో ఒక భాగమని పేర్కొన్నారు. నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ రాష్ట్రంలో క్యాన్సర్ సంరక్షణను మెరుగుపరచడానికి ఒక సమర్థవంతమైన నెట్‌వర్క్‌ను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ పైలెట్ ప్రాజెక్టు కింద కింగ్ జార్జ్ హాస్పిటల్ (విశాఖపట్నం), గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (కాకినాడ), గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (గంటూరు), స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ (కర్నూల్)లలో అమలు చేస్తారన్నారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ డీఎస్‌వీఎల్ నరసింహం, ఎక్కడమిక్ డీఎంఈ డాక్టర్ రఘునందన్ ఈ ప్రోగ్రాం గురించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో క్యాన్సర్ సంరక్షణను మెరుగుపరచడానికి ఒక ముఖ్యమైన అడుగు అని పేర్కొన్నారు. సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ మాట్లాడుతూ గుంటూరు, చుట్టుపక్కల జిల్లాల ప్రజలను మెరుగైన క్యాన్సర్ వైద్య సేవలు అందించేందుకు తాము అన్ని విధాలా సహకరిస్తామన్నారు. కార్యక్రమంలో నాట్కో క్యాన్సర్ సెంటర్ కో ఆర్డినేటర్ యడ్లపాటి అశోక్‌కుమార్, క్యాన్సర్ వైద్యులు డాక్టర్ దుర్గాప్రసాద్, డెప్యూటీ సూపరింటెండెంట్‌లు డాక్టర్ నీలి ఉమాజ్యోతి, డాక్టర్ ఉప్పాల శ్రీనివాస్, సివిల్ సర్జన్ ఆర్‌ఎంఓ డాక్టర్ సతీష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


