దమ్ముంటే పెమ్మసాని రాజీనామా చేయాలి
ఇచ్చిన మాటకు కట్టుబడాలి
● వక్ఫ్‌బోర్డు బిల్లుకు టీడీపీ, జనసేన మద్దతు తెలపడం సిగ్గుచేటు ● వైఎస్సార్ సీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరిఫాతిమా ధ్వజం
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): మైనార్టీల స్వేచ్ఛకు భంగం కలిగితే తక్షణం రాజీనామా చేస్తానని ఎన్నికల వేళ హామీ ఇచ్చిన ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ దమ్ముంటే ఇప్పుడు తక్షణం మాట నిలబెట్టుకోవాలని వైఎస్సార్ సీపీ గుంటూరు తూర్పు సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా డిమాండ్ చేశారు. వక్ఫ్‌బోర్డు బిల్లుకు టీడీపీ మద్దతు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఆమె గురువారం గుంటూరు మంగళదాస్ నగర్‌లోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వక్ఫ్‌బోర్డు బిల్లు ముస్లింల హక్కులను హరిస్తుందని ధ్వజమెత్తారు. మోసం చేయడంలో గురువు చంద్రబాబును పెమ్మసాని అనుసరిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో పెమ్మసాని చేసిన ఉపన్యాసం వీడియోను ప్రదర్శించారు. వక్ఫ్‌బోర్డు బిల్లుకు మద్దతు తెలిపిన టీడీపీ, జనసేన మైనార్టీలకు ద్రోహం చేశాయని దుయ్యబట్టారు. వక్ఫ్‌బోర్డులో నాన్ మైనార్టీ సభ్యుడిని పెట్టే అంశం వల్ల ముస్లింలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన చెందారు. వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్‌ఆర్‌సీ బిల్లును వ్యతిరేకించడంతోపాటు, పార్లమెంట్‌లో కూడా సుస్పష్టంగా ఎంపీల చేత చెప్పించిన అంశాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు ముస్లింలకు ఎప్పుడూ అన్యాయం చేస్తూనే ఉన్నారని విమర్శించారు.
ఈవీఎం ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ నోరు మెదపరేంటీ..!
మైనార్టీలకు తీరని ద్రోహం జరుగుతుంటే, మైనార్టీ ఎమ్మెల్యే అయిన ఎం.డీ.నసీర్ అహ్మద్ నోరు మెదపకపోవడం హాస్యాస్పదంగా ఉందని ఫాతిమా అన్నారు. స్థానిక ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా గెలిచారు కనుకనే ఆయనకు మైనార్టీల కష్టాలు ఏమాత్రం తెలియవన్నారు. ఈద్గా వద్ద దీనిపై చర్చించేందుకు పలువురు సుముఖత చూపిన నేపథ్యంలో పక్కన పేటీఎం బ్యాచ్‌ను పెట్టుకుని ఏ ఒక్కరినీ రానీయకుండా నసీర్ అడ్డుకున్నారని విమర్శించారు. మైనార్టీలకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. కులమతాలకతీతంగా అందరూ మైనార్టీలకు అండగా నిలవాలని ఫాతిమా కోరారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం నేతలు, పలువురు డివిజన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.


