క్రైస్తవుల భద్రతకు ప్రభుత్వం రక్షణ కల్పించాలి
ఐఆర్‌ఈఎఫ్ అధినేత బిషప్ డాక్టర్ ఇమ్మానుయేలు రెబ్బా
రేపల్లె రూరల్: క్రైస్తవుల భద్రతకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని ఐఆర్‌ఈఎఫ్ అధినేత బిషప్ డాక్టర్ ఇమ్మానుయేలు రెబ్బా అన్నారు. అనుమానాస్పద స్థితిలో ఇటీవల మృతి చెందిన పాస్టర్ పగడాల ప్రవీణ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ రేపల్లె క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన శాంతి ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేవుని వాఖ్యాన్ని ప్రజలకు చేర్చి పరిశుద్దులను చేసే పాస్టర్‌లపై దాడులకు పాల్పడటం అమానుషమని పేర్కొన్నారు. క్రైస్తవులపై దాడులు జరగకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై ప్రభుత్వం దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. వైఎస్సార్ సీపీ క్రిస్టియన్ మైనార్టీ బాపట్ల జిల్లా మాజీ అధ్యక్షుడు చిత్రాల ఓబేదు మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ మృతిపై పలు అనుమానాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం అన్నికోణాలలో సమగ్ర విచారణ జరిపి తగు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో పాస్టర్‌లపై దాడులు జరగకుండా ప్రభుత్వం కఠిన చట్టాలను రూపొందించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రవీణ కుటుంబ సభ్యులకు క్రైస్తవ సంఘాలు అన్ని వేళలా అండగా నిలుస్తాయని అన్నారు. ర్యాలీ బస్టాండ్, మున్సిపల్ కార్యాలయం, నెహ్రు బొమ్మ సెంటరుల మీదగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని తహసీల్దార్, పోలీసుస్టేషన్‌లలో వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో క్రైస్తవ సంఘాల నాయకులు గుజ్జర్లమూడి ప్రశాంత్‌కుమార్, గుజ్జర్లమూడి ఇమ్మానుయేలు, సముద్రాల ప్రభుకిరణ్, షేక్ ఖుద్దూష్, ఆలా రాజ్‌పాల్, జాలాది మునియ్య, జాలాది సునీల్, వివిధ చర్చిల పాస్టర్‌లు, క్రైస్తవ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
క్రైస్తవుల భద్రతకు ప్రభుత్వం రక్షణ కల్పించాలి


