నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పటిష్ట చర్యలు
పట్నంబజారు: ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రధాన కూడళ్లలో ఆటోలు, సిటీ బస్సులు, ఇతర వాహనాలు నిలుపుదల చేయకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం గుంటూరు నగరంలోని ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలో, కొత్తపేట పోలీసుస్టేషన్ పరిధిలో, ఆర్కేటీ సెంటర్, టౌన్ చర్చి, కింగ్ హోటల్ సెంటర్, ఎన్టీఆర్ సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్, పూల మార్కెట్ వరకు నడుచుకుంటూ ట్రాఫిక్ సరళి పరిశీలించారు. ట్రాఫిక్ అంతరాయానికి కారణమవుతున్న సమస్యల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ సతీష్‌కుమార్ మాట్లాడుతూ నిబంధనలు పటిష్టంగా అమలు పరచడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తీరుతాయన్నారు. ఆటోవాలాలు, ఇతర వాహనదారులు వాటి వాహనాలను క్రమపద్ధతిలో నిలుపుకునేలా చూడాలన్నారు. ఎస్పీ వెంట స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ బి.సీతారామయ్య, కొత్తపేట పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ఎం.వీరయ్యచౌదరి, పాతగుంటూరు పోలీసుస్టేషన్ ఎస్‌హెచ్‌ఓ వై.వీరసోమయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ సతీష్‌కుమార్
నగరంలో పర్యటన


