పట్టుదలతో అంకుఠిత దీక్ష
ఢిల్లీ టూ గుంటూరు
● తొలి ప్రయత్నంలో ఐపీఎస్ సాధన ● నాలుగేళ్లకు పైగా కష్టపడి లక్ష్యం సాకారం ● ఓ వైపు విధులు నిర్వహిస్తూ పరీక్షకు సిద్ధం ● మహిళలకు భద్రత, రక్షణ లక్ష్యం
దేశంలో అత్యున్నత సర్వీసుల్లో కొలువు సాధించాలంటే కఠోరమైన సాధన, అకుంఠిత దీక్ష , పట్టుదల ఉండాలి. ఒకవేళ లక్ష్య సాధనలో అపజయాలు, అటుపోట్లు ఎదురైనా ధైర్యంతో విజయం వైపు ముందుకు సాగాలి. ఐఏఎస్, ఐపీఎస్ సాధించాలంటే మరింతగా శ్రమించక తప్పదు. అయితే, దేశంలో మహిళలపై జరుగుతున్న నేరాలను ప్రాథమిక దశలో కట్టడి చేయాలనే ఆలోచన ఆమెలో ఐపీఎస్ లక్ష్య సాధనకు బీజం వేసింది. దీంతో కఠోరమైన సాధన మొదలైంది. దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కొక్క ప్రభుత్వ కొలువుల్లో విధులు నిర్వహిస్తూ.. మరోవైపు ఐపీఎస్ సాధించేందుకు ప్రణాళికను రూపొందించుకున్నారు దీక్ష. తొలి ప్రయత్నంలో ఐపీఎస్‌కు ఎంపికై , దేశవ్యాప్తంగా 208 ర్యాంక్ సాధించారు. తెలంగాణ హైదరాబాద్ అప్పాలో శిక్షణ పూర్తయిన తర్వాత గుంటూరు జిల్లాకు బదిలీయ్యారు.
నగరంపాలెం: దేశ రాజధాని పశ్చిమ ఢిల్లీ వాసి దీక్ష. తండ్రి దిల్జీత్‌సింగ్ విద్యాశాఖ అధికారి. తల్లి సునీత అసోసియేట్ ఆచార్యులు. ఇద్దరు సోదరులు. ఆమె భర్త ముఖేష్ ఆదాయపుపన్ను శాఖ అధికారి (ఐఆర్‌ఎస్). 2016లో యూపీఎస్‌సీ పరీక్షల్లో దీక్ష ఉత్తీర్ణత సాధించారు. ఇండియన్ ఇన్‌ఫర్‌మేషన్ సర్వీస్‌కు ఎంపికై ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ)లో విధులు నిర్వర్తించారు. ఓ వైపు సమర్థంగా విధులు నిర్వహిస్తూ.. మరలా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. 2018లో డీఎస్పీ ర్యాంకర్ అధికారిగా ఎంపికై ఢిల్లీలో నాలుగేళ్లు పని చేశారు. ఈ సమయంలో అనేక సవాళ్లు, దేశ రాజధానిలో వీఐపీల రాకపోకలు, బందోబస్త్ ఇతరత్రా అంశాలపై అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సి వచ్చేది. 2021లో దీక్ష ఐపీఎస్‌కు ఎంపికై , 208వ ర్యాంక్ సాధించారు. దీంతో ఆమె ఆనందానికి ఆవధుల్లేవు. ఇక తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ అప్పాలో ఐపీఎస్ శిక్షణ పూర్తి కావడం చకచకా జరిగిపోయాయి. గుంటూరు జిల్లాకు శిక్షణ ఐపీఎస్ అధికారిణిగా ఇటీవల విధుల్లో చేరారు.
నేరాలు కలిచివేసేవి : దీక్ష
ఐపీఎస్ సాధించాలనే లక్ష్యం మొదట్లోనే మదిలో నాటుకుంది. చిన్నారులు, బాలికలు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారిపై జరిగే నేరాలు మరింతగా కలిచివేసేవి. మహిళలపై నేరాలను తొలిదశలోనే నియంత్రించాలనే ఒక బలమైన కోరిక ఉండేది. సాధ్యమైనంత వరకు వాటిని కట్టడి చేయాలనేది నా ఆశయం. కుటుంబ వివాదాలు, మాదక ద్రవ్యాల వాడకం వల్ల తలెత్తే దుష్పరిణామాలు, తద్వారా విచ్ఛినమయ్యే కుటుంబాల పరిస్థితులు, సైబర్ మోసాలు, ఆర్థిక నేరాలపై అవగాహన కల్పించడం, ముందస్తు చర్యలపై కూలంకషంగా వివరించాలనేది లక్ష్యం. ఈ క్రమంలో దేశంలోని అత్యున్న సర్వీస్ ద్వారా మహిళలకు భద్రత, వారికి రక్షణ కల్పించాలనేది ఒక లక్ష్యంగా మారింది. దీంతో ఐపీఎస్ కొలువు సాధిం చేందుకు అహర్నిశలు శ్రమించాను. విధి నిర్వహణలో తీరిక లేకున్నా.. పట్టుదల, అకుంఠిత దీక్షతో రేయింబవళ్లు చదివాను. నాలుగేళ్లకు పైగా కష్టపడ్డాను. ఐపీఎస్‌లో దేశవ్యాప్తంగా 208వ ర్యాంక్ సాధించడం ఆనందంగా ఉంది. ఏదైనా ప్రభుత్వ కొలువు సాధించాలంటే కఠోరమైన సాధన ఉండాల్సిందే. పోటీ పరీక్షలను పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలి. ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో కొలువు సాధించాలనే తపన ఉండాలి. తద్వారా విజయం వైపు నడవాలి.
ఐదు రోజుల్లో ఐదు కోట్ల రూపాయల దోపీడీ కేసు ఛేదన
గుంటూరు జిల్లాకు తొలి పోస్టింగ్ అయినా.. తెలుగు భాషా కొంత వరకు మాట్లాడుతున్నా. జిల్లాలో నేరాల నియంత్రణకు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ నేతృత్వంలో ముందస్తు చర్యలు చేపడుతున్నాం. సైబర్ నేరాలపై మేళాలు, కొద్ది నెలలు క్రితం జిల్లాలోని మహిళల కోసం ప్రారంభించిన మహిళా మీ కోసం.. మీ భద్రత.. మా బాధ్యత చాలా బాగుంది. సత్ఫలితాలునిచ్చాయి. ఇటీవల మంగళగిరి ఆత్మకూరు వద్ద జరిగిన రూ.5 కోట్ల బంగారు అభరణాల దోపిడీ ఘటనను సవాల్‌గా స్వీకరించాం. ఐదు రోజుల్లోనే దోపీడీని ఛేదించాం. సినీ ఫక్కీలో జరిగిన దోపిడీని కొద్ది రోజుల్లో రికవరీ చేయడం మరిచిపోలేని అనుభూతి. ఇక మహా శివరాత్రి సందర్భంగా జిల్లాలోని క్వారీ తిరునాళ్లలో సమర్థంగా విధులు నిర్వర్తించాం. అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకోవడంలో సఫలీకృతులయ్యాం.
పట్టుదలతో అంకుఠిత దీక్ష


