సామాజిక సాహిత్య దృక్పథంతో రచనలు
నగరంపాలెం: వామపక్ష, దళిత, బహుజన సామాజిక సాహిత్య దృక్పథంతో చంద్రశేఖరరావు రచనలు చేశారని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పెనుకొండ లక్ష్మీనారాయణ అన్నారు. ఆదివారం బ్రాడీపేటలో డాక్టర్ వి.చంద్రశేఖరరావు జయంతి సాహిత్య పురస్కార సభ– 2005 నిర్వ హించారు. సభకు అధ్యక్షత వహించిన పెనుకొండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వర్గీకరణ ఉద్యమ ప్రభావ నేపథ్యంలో ఆ ఉద్యమానికి దోహదం చేసే రచనలు సాగించారన్నారు. చంద్రశేఖరరావు విలక్షణమైన రచనలను కథా సంపాదకులు వాసిరెడ్డి నవీన్ సోదాహరణంగా వివరించారు. సినీ దర్శకులు సి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ చంద్రశేఖరరావు గత చరిత్రకు సంబంధించిన ఉద్వేగాలను ద్రశ్యమానం చేశారని అన్నారు. అనంతరం కలుంకూరి గుట్ట కథా సంపుటి రచయిత కె.వి.మేఘనాథరెడ్డికి డాక్టర్ వి.చంద్రశేఖరరావు సాహిత్య పురస్కారాన్ని డాక్టర్ వి.ప్రసూన అందించారు. కలుంకూరిగుట్ట కథల్లోని వైశిష్ట్యాన్ని విశ్లేషిస్తూ రాయలసీమ ప్రాంత కరువును అద్భుతమైన మాండలికంతో జానపదుల భాషలోని సౌందర్యాన్ని మేఘనాథరెడ్డి చిత్రించారని కందిమళ్ల శివప్రసాద్ అన్నారు. కార్యక్రమంలో కాట్రగడ్డ దయానంద్, పుప్పాల శ్రీరాం, పాపినేని శివశంకర్, బండ్ల మాధవరావు, శ్రీశ్రీ విశ్వేశ్వరరావు, పారా అశోక్, మన్నం సింధుమాధురి పాల్గొన్నారు.


