ప్రవీణ్ పగడాల కేసులో అన్నీ అనుమానాలే
తాడేపల్లి రూరల్: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఐజీ అశోక్‌కుమార్ చేసిన దర్యాప్తుపై అన్నీ అనుమానాలే ఉన్నాయని, కేసును రీ ఓపెన్ చేసి మళ్లీ దర్యాప్తు చేయాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం తాడేపల్లిలోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రవీణ్ పగడాలపై నిందలు వేసేలా ఐజీ అశోక్ కుమార్ దర్యాప్తు కొనసాగిందని విమర్శించారు. మృతిపై అనుమానం ఇప్పటికీ ప్రబలంగా ఉందని వివరించారు. ఘటనా స్థలంలో ప్రవీణ్ మృతదేహం చూసినప్పుడు వెల్లువెత్తిన అనుమానాలు ఒక్కదానికీ పోలీసులు సరైన సమాధానం చెప్పలేదని పేర్కొన్నారు. ప్రవీణ్ కేసులో వైరలైన సీసీటీవీ ఫుటేజ్‌లు అనుమానాలకు తావిస్తున్నాయన్నారు. కీసర టోల్‌గేటు వద్ద జరిగిన ఘటనపై పోలీసులు చెబుతున్న దానికి, వీడియోలో ఉన్నదానికి పొంతన లేదని విజయ్‌కుమార్ పేర్కొన్నారు. విజయవాడలోని అన్ని సీసీ టీవీ ఫుటేజ్‌లు ఎందుకు పరిశీలించలేదని ప్రశ్నించారు. ఓ పోలీస్ అధికారి ప్రవీణ్ మద్యం సేవించలేదని చెప్పినట్లు రిపోర్ట్ అయిందని గుర్తుచేశారు. ఈ కేసుపై నిజ నిర్ధారణ కోసం జాయింట్ యాక్షన్ కమిటీ వేసి ముందుకు వెళతామని తెలియజేశారు. తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ విషయంలో కమిటీ రిపోర్టు ఏం తేల్చిందో సర్కారు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. వక్ఫ్ సవరణ బిల్లులో తాము కొన్ని సవరణలు చెప్పామని చెబుతున్న కూటమి పార్టీలు ఏం సవరణలు చెప్పారో తెలియజేయాలని డిమాండ్ చేశారు.
మళ్లీ దర్యాప్తు కొనసాగించాలి
కేసు రీ ఓపెన్‌చేయాలి
లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
విజయ్‌కుమార్


