ఆత్మస్తుతి.. పరనింద
తాడికొండ: తాడికొండ నియోజకవర్గంలో సోమ వారం జరిగిన సీఎం చంద్రబాబు పర్యటన పేలవంగా సాగింది. పీ–4 పథకంలో భాగంగా మార్గదర్శి–బంగారు కుటుంబం లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం అట్టర్‌ఫ్లాప్ అయింది. ఈ కార్యక్రమంలో ఆద్యంతం సీఎం చంద్రబాబు ఆత్మస్తుతి.. పరనిందకు ప్రాధా న్యం ఇచ్చారు. నియోజకవర్గ సమస్యల గురించి పన్నెత్తి మాట్లాడలేదు. ఫలితంగా ప్రజలు ఉసూరుమన్నారు. సభ సాక్షిగా తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలతోపాటు స్థానికంగా ప్రధాన సమస్యలు ఏకరువు పెట్టినా చంద్రబాబు చలించలేదు.
ఈ సమస్యలపై స్పందనేదీ?
2014లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రోడ్ల విస్తరణ పేరుతో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తాడికొండ ప్రధాన రహదారి వెంట ఇళ్ళు కూల్చివేతలు జరిగాయి. బాధితులు పరిహారం కోసం కాళ్ళరిగేలా తిరిగినా ఒక్క రూపాయి ఇవ్వలేదు. దీంతో తాడికొండ కొండపై ఉన్న మల్లికార్జున స్వామి ఆలయానికి, ఫిరంగిపురం కార్మెల్ మాత ఆలయానికి ఘాట్ రోడ్ల నిర్మాణంపై గత ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ హామీలను సోమవారం సభ సాక్షిగా ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ సీఎం దృష్టికి తీసుకెళ్లినా సీఎం స్పందించలేదు. గ్రామాల్లో తాగునీటి సమస్య, లాం వద్ద కొండవీటి వాగుపై వంతెన నిర్మాణం కొండవీటి వాగు ఆధునికీకరణ, బండారుపల్లి మేజర్ పూడికతీత వంటి ప్రధాన సమస్యలనూ ఎమ్మెల్యే సీఎంకు వివరించారు. అయినా సీఎం సానుకూలంగా స్పందించలేదు. దీంతో స్థానికులు, నియోజకవర్గ ప్రజలు సీఎం తీరుపై ధ్వజమెత్తుతున్నారు. ఇదిలా ఉంటే జనం లేక సభాస్థలి వెలవెలబోయింది. సభకు తీసుకొచ్చిన డ్వాక్రా మహిళలను టీడీపీ నేతలు బెదిరించి కూర్చోబెట్టారు. ఎండ వేడిమికి వారు అల్లాడారు. స్నాక్స్ అందక ఇబ్బందులు పడ్డారు.
హెలిప్యాడ్ వద్ద సీఎంకు స్వాగతం
అంతకుముందు హెలిప్యాడ్ వద్ద సీఎంకు నేతలు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి, ఇన్‌చార్జి కలెక్టర్ భార్గవతేజ, ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, ఎస్పీ సతీష్ కుమార్, జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, మహమ్మద్ నసీర్ అహ్మద్, గళ్ళా మాధవి తదితరులు పాల్గొన్నారు.
సీఎం పర్యటన అట్టర్ ఫ్లాప్ జనం లేక వెలవెలబోయిన సభ డ్వాక్రా మహిళలను బెదిరించి కూర్చోబెట్టిన టీడీపీ నేతలు స్థానిక సమస్యలు పట్టించుకోని చంద్రబాబు నియోజకవర్గ సమస్యలు ఏకరువు పెట్టినా స్పందించని వైనం స్థానికులు గరంగరం
వేదికపై ఎస్సీలకు చోటేదీ..!
ఇదిలా ఉంటే అంబేడ్కర్ జయంత్యుత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమ వేదికపై ఎస్సీ నేతలకు చోటు దక్కలేదు. కేవలం ఓ సామాజిక వర్గానికి చెందిన నాయకులే అక్కడ బారులు తీరడం కనిపించింది. కార్యక్రమంలో పొన్నెకల్లు సర్పంచ్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నూకతోటి మేరిమ్మ, బీజేపీ నియోజకవర్గ అధ్యక్షుడు కంతేటి బ్రహ్మయ్య మినహా మరే ఎస్సీ నేతా కనిపించలేదు. వీరు కూడా ప్రొటోకాల్‌లో భాగంగా అక్కడ ఉన్నారు. దీనిపై ఎస్సీ నేతలు పెదవి విరుస్తున్నారు. ఈ వివక్ష ఏమిటని ప్రశ్నించారు.


