విజ్ఞాన్‌ను సందర్శించిన యూఎస్‌ఏలోని గానన్ వర్సిటీ ప్రత
చేబ్రోలు: వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీని యూఎస్‌ఏలోని గానన్ యూనివర్సిటీ ప్రతినిధి ప్రొఫెసర్ డాక్టర్ సి.అగర్వాల్ మహేష్ మంగళవారం సందర్శించారు. స్కూల్ ఆఫ్ కోర్ ఇంజినీరింగ్ విభాగంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజినీరింగ్, ఆఫీస్ ఆఫ్ ఐక్యూఏసీల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన ప్రొఫెసర్ డాక్టర్ సి.అగర్వాల్ మహేష్‌తో విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వైస్ చాన్స్‌లర్ పి.నాగభూషణ్ మాట్లాడుతూ విజ్ఞాన్ వర్సిటీ, యునైటెడ్ స్టేట్స్‌లోని గానన్ యూనివర్సిటీ మధ్య మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో విద్యా, పరిశోధనా రంగాల్లో సహకారాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో మూడు ముఖ్యమైన కార్యక్రమాలను ప్రారంభించామన్నారు. అందులో ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, ‘‘కోలాబొరేటివ్ హరైజన్స్: జాయింట్ రీసెర్చ్ ఇనిషియేటివ్స్’’, మరియు ట్విన్నింగ్ డిగ్రీ ప్రోగ్రామ్‌లు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా అధ్యాపకులు పరస్పర విజిట్లు చేయడం ద్వారా నూతన బోధనా పద్ధతులు, పరిశోధనా పరిజ్ఞానాన్ని పంచుకుంటున్నారని తెలిపారు. ఈ ఒప్పందాల ద్వారా విద్యా, పరిశోధన, సాంకేతిక పరస్పర మార్పిడితో పాటు, విద్యార్థులకు గ్లోబల్ ప్రొఫెషనల్ ప్రొఫైల్ అభివృద్ధి చేసే అవకాశాలు విస్తరించనున్నాయని తెలియజేసారు.


