కళా పురస్కారాలు ప్రదానం
తెనాలి: డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి నాటక కళాపరిషత్ జాతీయస్థాయి చతుర్ధ ఆహ్వాన నాటికల పోటీల్లో అయిదోరోజైన బుధవారం తెలుగు నాటకరంగ దినోత్సవాన్ని నిర్వహించారు. పట్టణానికి చెందిన సాంఘిక, పౌరాణిక పద్యనాటక కళాకారులు బద్దుల తిరుపతయ్య, దేవిశెట్టి కృష్ణారావు, చెన్నం సుబ్బారావును సంస్థ సభ్యులు ఘనంగా సత్కరించి, కళాపురస్కారాన్ని ప్రదానం చేశారు. తొలుత గుంటూరుకు చెందిన ప్రముఖ కూచిపూడి నృత్యగురువు సరిత శిష్యబృందం, ఆరిశెట్టి ఐశ్వర్య శిష్యబృందం, యనమదల రీతిక, శవ్వా గ్రీష్మశ్రీలు కూచిపూడి, జానపద నృత్యాంశాలను ప్రదర్శించారు. తెనాలి కళాకారుల సంఘం గౌరవ అధ్యక్షుడు ఆరాధ్యుల కన్నా, అధ్యక్షుడు అద్దేపల్లి లక్ష్మణశాస్త్రి పర్యవేక్షించారు. ఆరో రోజైన గురువారం సాయంత్రం కళాంజలి, హైదరాబాద్ వారి ‘అన్నదాత’, సహృదయం ద్రోణాదుల వారి ‘వర్క్ ఫ్రమ్ హోం’ నాటికల ప్రదర్శనలు వుంటాయని తెలియజేశారు.


