88 ఏళ్ల వృద్ధుడికి అరుదైన ఆపరేషన్
విలేకరుల సమావేశంలో డాక్టర్ ఫణీంద్ర కుమార్ వెల్లడి
గుంటూరు మెడికల్: స్వర పేటికకు పెరాలసిస్ వచ్చి ఎనిమిది నెలలుగా తీవ్ర ఇబ్బంది పడుతున్న 88 సంవత్సరాల వృద్ధుడికి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అరుదైన ఆపరేషన్ చేసి గొంతు సమస్యను సరిచేసినట్లు గుంటూరులోని శ్రీ సత్య సాయి ఫణింద్ర కుమార్ ఈఎన్‌టీ అండ్ వాయిస్ క్లినిక్ అధినేత, వాయిస్ సర్జన్ డాక్టర్ వి.ఫణీంద్ర కుమార్ చెప్పారు. బుధవారం గుంటూరు బ్రాడీపేటలో ఆసుపత్రిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆపరేషన్ వివరాలు ఆయన వెల్లడించారు. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన 88 సంవత్సరాల లక్ష్మణరావు 8 నెలలుగా స్వర పేటిక పెరాలసిస్‌కు గురై మాట రాక ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. లక్ష్మణరావు కుమారులు అమెరికాలో ఉండటంతో అక్కడికి వెళ్లిన వృద్ధుడు అమెరికాలో వైద్యులను సంప్రదిస్తే ఇండియాలో ఆపరేషన్ చేసే వైద్యులు ఉన్నారని అక్కడే చేయించుకోవాలని సూచించారు. దీంతో లక్ష్మణరావు పిల్లలు ఇండియాలోని తమ బంధువుల సలహా మేరకు ఫిబ్రవరి నెలలో చికిత్స కోసం లక్ష్మణరావును తమ వద్దకు తీసుకు వచ్చారన్నారు. వైద్య పరీక్షలు చేసి స్వర పేటిక పెరాలసిస్ వల్ల గొంతు రాకపోవడం, పీలగా మారటం చాలా చిన్నగా మాట్లాడటం వంటి సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించామన్నారు. ఎలాంటి కారణం లేకుండానే స్వర పేటిక పెరాలసిస్ రావడంతో ఫిబ్రవరి 17న సుమారు రెండు గంటలసేపు థైరోప్లాస్టి ఆపరేషన్ చేసి సమస్యను నివారించామన్నారు. కొద్దిరోజులపాటు వాయిస్ థెరపిస్ట్ పర్యవేక్షణలో లక్ష్మణరావుకు స్పీచ్ థెరపి చేయించడంతో నే డు పూర్తిస్థాయిలో మాట్లాడుతున్నట్లు డాక్టర్ ఫణీంద్ర కుమార్ వెల్లడించారు. మెడికల్ జర్నల్స్ లో 88 సంవత్సరాల వయసున్న వృద్ధుడికి ఆపరేషన్ చేయటం ప్రపంచంలో ఇదే మొట్టమొదటిసారి వెల్లడించారు. ఆపరేషన్ ప్రక్రియలో ఈఎన్‌టీ వైద్యులు డాక్టర్ భార్గవ్, మత్తు వైద్యులు డాక్టర్ సురేంద్ర పాల్గొన్నట్లు తెలిపారు. అరుదైన ఆపరేషన్ చేసి స్వర సమస్యను సరిచేసి మామూలు వ్యక్తి లాగా మాట్లాడే విధంగా చేసిన డాక్టర్ ఫణీంద్ర కుమార్ కు సీనియర్ సినీ నటుడు, లక్ష్మణరావు బావ అయిన మురళీమోహన్ అభినందనలు తెలిపారు.


