ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పల్లె పడక
● కూటమి పాలనలో అన్ని
వర్గాలకు ఇబ్బందులే
● వారి కష్టాలు తెలుసుకునేందుకు
ప్రత్యేక కార్యక్రమం
● వైఎస్సార్ సీపీ రేపల్లె నియోజకవర్గ
సమన్వయకర్త డాక్టర్ ఈవూరు గణేష్
రేపల్లె రూరల్: కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్సార్ సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరు గణేష్ ఆరోపించారు. చెరుకుపల్లి మండలం గుల్లపల్లిలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్పొరేట్ వ్యక్తులకు కొమ్ముకాయడమే కాకుండా పేదలను ఇబ్బంది పెట్టేలా కూటమి పాలన ఉందన్నారు. పది నెలల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. గ్రామస్థాయి నుంచి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడంతోపాటు ప్రభుత్వ వైఫల్యాలపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 18వ తేదీన ‘పల్లె పడక’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. చెరుకుపల్లి మండలం అల్లావారిపాలెంలో ఆ రోజు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. అదే రోజు గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుంటామని తెలిపారు. రాత్రికి గ్రామంలో బస చేసి, ప్రజలతో మమేకమై అక్కడే నిద్రించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.


