ఇసుక లారీ బీభత్సం
●ఆర్టీసీ బస్సును ఢీకొట్టి షాపుల్లోకి దూసుకెళ్లిన వైనం
● త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
చేబ్రోలు: ప్రమాదవశాత్తూ ఇసుక లారీ ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టి అదుపుతప్పి రోడ్డు పక్కనున్న షాపుల్లోకి దూసుకుపోయిన ఘటన చేబ్రోలు మండలం వేజండ్ల గ్రామంలో గురువారం జరిగింది. తెనాలి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు గుంటూరుకు బయలుదేరి వేజండ్ల అడ్డరోడ్డు వద్ద ప్రయాణికులను ఎక్కించుకోవటం కోసం నిలిచి ఉంది. అదే సమయంలో తెనాలి నుంచి నారా కోడూరు వైపు వేగంగా వస్తున్న టర్బో ఇసుక లారీ ఆర్టీసీ బస్సును వెనుకవైపు ఢీకొట్టింది. వెంటనే అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు, మెకానిక్ షాపులలోకి దూసుకువెళ్లింది. ప్రమాద సమయంలో షాపుల వద్ద ఎవరూ లేకపోవటంతో ప్రాణాపాయం తప్పింది. బస్సులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. చేబ్రోలు పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకొని ఇసుక లారీని, ఆర్టీసీ బస్సును పోలీసు స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇసుక లారీ బీభత్సం


