రైతుల దుస్థితిని కళ్లకు కట్టిన ‘అన్నదాత’
తెనాలి: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్మారక నాటక కళాపరిషత్, తెనాలి ఆధ్వర్యంలో ఇక్కడి రామలింగేశ్వరపేటలోని ఓపెన్ ఆడిటోరియంలో జరుగుతున్న జాతీయస్థాయి చతుర్ధ ఆహ్వాన నాటికల పోటీల్లో భాగంగా ఆరో రోజైన గురువారం రెండు నాటికలను ప్రదర్శించారు. తొలుత కళాంజలి, హైదరాబాద్ వారి అన్నదాత నాటికను ప్రదర్శించారు. నేటి సమాజంలో రైతుల పరిస్థితిని కళ్లకు కట్టిందీ నాటిక. అప్పుల్లో కూరుకుపోతున్న రైతులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్న వర్తమాన స్థితిని ఎత్తిచూపింది. రైతాంగం మనుగడ ప్రశ్నార్థకం కావటం వ్యవసాయాధారిత దేశంలో ఓ గొప్ప విషాదంగా వర్ణించిందీ నాటిక. వల్లూరు శివప్రసాద్ రచించిన ఈ నాటికను కొల్లా రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రదర్శించారు. వివిధ పాత్రల్లో శోభారాణి, సురభి ప్రియాంక, భుజంగరావు, పున్నయ్యచౌదరి, రాధాకృష్ణ, తిరుమల, శివరాం, ప్రశాంత్ నటించారు.
వినోదాన్ని పంచిన ‘వర్క్ ఫ్రమ్ హోమ్’..
అనంతరం సహృదయ, ద్రోణాదుల వారి ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ నాటికను ప్రదర్శించారు. నలభీముడిలా వంటల చేయగల దిట్ట అయిన సుధీర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా చేస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్‌లో అటు వృత్తిపని, ఇంట్లోకి తరచూ వచ్చే చుట్టాలకు వంటలు చేస్తూ సతమతమైన వ్యవహారాన్ని ఆద్యంతం హాస్య సన్నివేశాలకు వినోదాత్మకంగా సాగిందీ నాటిక. చివరకు ఉద్యోగానికి రిజైన్ చూసి ‘సౌమ్యలక్ష్మీ హోమ్ ఫుడ్స్’ పేరుతో స్టార్టప్‌ను ప్రారంభిస్తాడు. కేకే భాగ్యశ్రీ మూలకథను అద్దేపల్లి భరత్‌కుమార్ నాటకీకరించగా, డి.మహేంద్ర దర్శకత్వం వహించి, ప్రధాన పాత్రలో నటించారు. ఇతర పాత్రల్లో కొత్త శివరాంప్రసాద్, ఆళ్ల హరిబాబు, షేక్ షఫీ ఉజ్మా, వి.నాగేశ్వరరావు, లహరి నటించారు. తొలుత యనమదల రీతిక శిష్యబృందం కూచిపూడి నృత్యప్రదర్శన ఆహుతుల అభినందనలు అందుకుంది. తెనాలి కళాకారుల సంఘం నిర్వహణలో జరుగుతున్న ఈ నాటికల పోటీలను గౌరవాధ్యక్షుడు ఆరాధ్యుల కన్నా, అధ్యక్షుడు అద్దేపల్లి లక్ష్మణశాస్త్రి, కార్యదర్శి పిట్టు వెంకటకోటేశ్వరరావు పర్యవేక్షించారు.


