గుంటూరులో అర్ధరాత్రి ఐజీ, ఎస్పీ తనిఖీలు
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): అరండల్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రాడీపేట నాలుగో లైన్‌లో గురువారం అర్ధరాత్రి గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠీ, ఎస్పీ సతీష్ కుమార్, వెస్ట్ డీఎస్పీ కె.అరవింద్ తదితర పోలీసు అధికారులు ఆకస్మికంగా పర్యటించారు. శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నిబంధనలు అమలు, అసాంఘిక కార్యకలాపాల కట్టడికి పోలీస్ అధికారులు తీసుకుంటున్న చర్యలు వంటి పలు అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల రవాణా, బహిరంగ మద్యపానం వంటి కార్యకలాపాలను అరికట్టడానికి తనిఖీలు విస్తృతంగా చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు భరోసా కల్పించేలా విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలని సూచించారు. తనిఖీల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రికి పెరిగిన రద్దీ
విజయవాడ : వారాంతం, పండుగలు, వేసవి సెలవుల నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం కావడంతో తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి విచ్చేసిన యాత్రికులతో ఉదయం 7 గంటల నుంచే ఆలయ ప్రాంగణంలో క్యూలైన్లలో రద్దీ కనిపించింది. మధ్యాహ్నం 3 గంటల వరకు రద్దీ కొనసాగగా, ఆది దంపతులకు నిర్వహించిన ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. నూతన వధూవరులు పెళ్లి దుస్తుల్లో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.


