సువర్ణ అక్షరం
జగనన్న పాలన
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలలకు ప్రాణం పోసిన మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెచ్చిన చదువుల విప్లవం భావి ప్రభుత్వాలకు దారి చూపుతోంది. విద్యారంగానికి దశ, దిశ చూపిన ఆయన ముందుచూపు, పేదల చదువుల కోసం పడిన తపన చిరస్థాయిగా నిలిచింది. ప్రభుత్వ విద్యాసంస్థల నుంచి పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షల్లో ప్రతిభావంతులుగా నిలిచిన విద్యార్థులను ‘‘జగనన్న ఆణిముత్యాలు’’ కార్యక్రమం ద్వారా నగదు ప్రోత్సాహాలతో సత్కరించాలని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీసుకున్న మహత్తరమైన నిర్ణయం నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. సమస్యల సుడి గుండంలో కొట్టుమిట్టాటడుతున్న ప్రభుత్వ పాఠశాలలను మనబడి నాడు–నేడు ద్వారా సకల హంగులతో ఆధునికీకరించి, పేద, మధ్య తరగతి విద్యార్థుల చదువులకు పెన్నిధిగా నిలిచిన వైఎస్ జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు పర్చిన జగనన్న ఆణిముత్యాలు బాటలోనే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న షైనింగ్ స్టార్స్ రూపుదిద్దుకుంది.
టెన్త్, ఇంటర్ పరీక్షల ప్రతిభావంతుల కోసం ఆణిముత్యాలు
2003 మార్చి, ఏప్రిల్‌లో జరిగిన ఇంటర్మీడియెట్, టెన్త్ పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో అత్యధిక మార్కులతో నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రస్థాయిలో ప్రతిభావంతులుగా నిలిచిన విద్యార్థులను జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమం ద్వారా సత్కరించారు. గుంటూరు జిల్లాలోని నియోజకవర్గ స్థాయిలో టెన్త్‌లో 23 మంది, ఇంటర్‌లో 15 మంది విద్యార్థులకు అదే ఏడాది జూన్ నెలలో జరిగిన కార్యక్రమాల ద్వారా అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో నగదు ప్రోత్సాహకాలను పంపిణీ చేశారు. వీరితో పాటు జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పరిధిలో ప్రతి పాఠశాల నుంచి టెన్త్‌లో తొలి మూడుస్థానాల్లో నిలిచిన విద్యార్థులను సైతం ఎంపిక చేసి, అదనంగా మరో 469 మంది విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. రాష్ట్రస్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు 2003 జూన్ 20న నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేతుల మీదుగా రూ.లక్ష చొప్పున నగదు ప్రోత్సహకాన్ని అందుకున్నారు.
జగనన్న ఆణిముత్యాలు ప్రోత్సాహకాలు ఇలా..
జిల్లాస్థాయిలో టెన్త్, ఇంటర్‌లలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచిన విద్యార్థులకు వరుసగా రూ.50వేలు, రూ.30వేలు, రూ.10వేలు చొప్పున, నియోజకవర్గ స్థాయిలో తొలిమూడు స్థానాల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు వరుసగా రూ.15వేలు, రూ.10వేలు, రూ.ఐదు వేలు చొప్పున నగదు ప్రోత్సాహకాలను పంపిణీ చేశారు. వీరితోపాటు ప్రతి ఒక్క ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి ఎంపిక చేసిన తొలి ముగ్గురు విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో వరుసగా రూ.మూడువేలు, రూ.రెండువేలు, రూ.వెయ్యి చొప్పున అందజేశారు. ప్రతిభ చూపిన విద్యార్థుల తల్లిదండ్రులను, సంబంధిత హెచ్‌ఎం, ప్రిన్సిపాల్స్‌ను సైతం సన్మానించారు.
ప్రభుత్వ పాఠశాలలకు దశ, దిశ చూపిన వైఎస్ జగన్
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రభుత్వ పాఠశాలలు ఊపిరిపోసుకున్నాయి. నాడు–నేడు, జగనన్న విద్యాకానుక, జగనన్న అమ్మఒడి, గోరుముద్ద కార్యక్రమాలతో ప్రగతిబాట పట్టిన ప్రభుత్వ పాఠశాలలు ఆధునిక విద్య దిశగా అడుగులు వేశాయి. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణీతోపాటు తరగతి గదుల్లో ఐఎఫ్‌పీల ద్వారా డిజిటల్ విద్యాబోధనకు నాంది పలికారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు ట్యాబ్స్, నగదు అందించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన తొలి సీఎంగా నిలిచిన వైఎస్ జగన్ విద్య ప్రభుత్వ బాధ్యత కాదన్న వారితోనే ప్రస్తుతం విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించేలా చేశారు.
ప్రభుత్వ విద్యారంగానికి ఊపిరి మనబడి నాడు–నేడు, విద్యాకానుక, అమ్మఒడి, గోరుముద్ద కార్యక్రమాలతో ప్రగతిబాట పట్టిన ప్రభుత్వ పాఠశాలలు ట్యాబ్స్ పంపిణీ, ఐఎఫ్‌పీలతో డిజిటల్ విద్యాబోధనకు నాంది టెన్త్, ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు జగనన్న అణిముత్యాలు ద్వారా నగదు ప్రోత్సాహకాలు అదే బాటలో షైనింగ్ స్టార్స్ కార్యక్రమం చేపట్టిన ప్రస్తుత కూటమి సర్కారు ల్యాప్‌ట్యాప్‌తో సరిపెట్టిన వైనం
ఇంటర్ విభాగంలో జిల్లా నుంచి ఒక్క విద్యార్థిని ఎంపిక
ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో గుంటూరులోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల నుంచి ఎంఈసీ గ్రూప్‌లో 967 మార్కులు సాధించిన గుంటూరు నగరానికి చెందిన సర్వేపల్లి రాజేశ్వరిని షైనింగ్ స్టార్ కింద ప్రభుత్వం ఎంపిక చేసి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా అభినందించింది. ఈనెల 18న ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాజేశ్వరికి ల్యాప్‌టాప్ అందజేశారు. గుంటూరు జిల్లా నుంచి ఒక్క విద్యార్థినినే ఎంపిక చేసి, ల్యాప్‌టాప్ అందజేసి మమ అనిపించారు
సువర్ణ అక్షరం


