వీధి వ్యాపారులపై ఆశీలు భారం
తెనాలి: పట్టణంలో చిరు వ్యాపారులపై మున్సిపాలిటీ ఆశీలు భారం మోపింది. రోజుకు రూ.10 వసూలు చేస్తున్న ఆశీలు మొత్తాన్ని ఇప్పుడు ఏకంగా రూ.30కు పెంచింది. చిన్నాచితకా వ్యాపారాలతో పొట్టపోసుకునే వ్యాపారులకు మున్సిపాలిటీ నిర్ణయం భారమైంది. నిత్యావసర సరుకుల ధరలు పెరిగి ఎదుగూ బొదుగూ లేని ఆదాయంతో జీవిస్తున్న తమపై అదనపు భారాన్ని మోపడం సరికాదని, వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వ్యాపారులు కోరుతున్నారు. ఏ పట్టణం చూసినా ఏమున్నది గర్వకారణం.. వీధులనిండా తోపుడుబండ్లు, ఫుట్‌ఫాత్‌లన్నీ ఆక్రమణలే! అన్న వ్యాఖ్యలు తరచూ వింటుంటాం. స్ట్రీట్ వెండర్లు, హాకర్లుగా పిలిచే ఈ చిరువ్యాపారులు ట్రాఫిక్‌కు అవరోధమని భావించటం పరిపాటి. ప్రభుత్వ అధికారులు, పోలీసుల అదిరింపులు, బెదిరింపులు, పౌరుల ఛీత్కారాల మధ్య బతుకుదెరువు కోసం అలసట లేని జీవనపోరాటం వారిది. జీవించడానికి వేరే ఏమార్గం లేక, కొద్దిపాటి పెట్టుబడితో రోడ్డుపక్కనే ఉపాధిని ఏర్పాటుచేసుకునే చిరువ్యాపారులు పట్టణ పంపిణీ వ్యవస్థలో ముఖ్య భూమిక వహిస్తున్నారు. పట్టణ ప్రజాజీవనంలో వీరి పాత్రను విభజించలేం. పెద్ద షాపులకు వెళ్లి హెచ్చు ధరలు పెట్టలేని ప్రజలకు నిత్యావరాలైన కూరగాయలు, పండ్లు, పూలు, గాజులు.. ఇలా ఒకటేమిటి? సమస్త ఉత్పత్తులను అందుబాటులో ఉండే ధరల్లో అందిస్తున్నారు. అయినా పాలకులు, అధికారులు, ప్రజలకు వీరంటే చిన్నచూపే. స్థానికంగా ఉండే పోలీస్, మున్సిపల్ సిబ్బంది వల్ల ఇబ్బందులు పడుతుంటారు. ఒక్కోసారి తమ సరుకులను నష్టపోతుంటారు. ఏ రాజకీయ నాయకుడో సభ పెట్టారంటే ఆరోజు వ్యాపారం లేనట్టే. కొన్ని సందర్భాల్లో పోలీసు కేసులను ఎదుర్కోవటం, జరిమానా చెల్లించటం అనివార్యం. వాస్తవంగా వారి హృదయాలను తట్టిచూసే ఓపికా, తీరికా ఎవరికీ లేవు.
2,000 మందికిపైగా వీధి వ్యాపారులు
పట్టణంలోని స్ట్రీట్‌వెండర్లు, హాకర్లు గతేడాది అధికారికంగా 1,650 వరకు ఉన్నారు. ఈ సంవత్సరం వారి సంఖ్య 2,000 పైగానే ఉంటుందని అంచనా. వీరిలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూలు, మొక్కజొన్న కండెలు, కొబ్బరి బొండాలు దుస్తులు, చిన్నవస్తువులు విక్రయించేవారే అధికం. ప్రధానంగా మార్కెట్ ఏరియా, మెయిన్‌రోడ్డు, గాంధీచౌక్, శివాజీచౌక్, చెంచుపేట, నెహ్రూరోడ్డులో అధికంగా ఉంటారు. ఇతర ప్రాంతాల్లో రోడ్డు వెంట ఉండే అమ్మకాలు చేస్తుండే చిరువ్యాపారులు కనిపిస్తుంటారు. ఎక్కువగా సైకిళ్లపై వ్యాపారాలు చేస్తుంటారు. ఇరువైపులా వ్యాపార దుకాణాలు ఉండే మెయిన్‌రోడ్డు ‘తోపుడుబండ్ల వ్యాపారుల హబ్’ అంటారు. ఉదయం పూట రోడ్డుకు రెండుపక్కలా పదులసంఖ్యలో మహిళలు రోడ్డుపైనే గంపలు లేదా నేలపైనే కూరగాయలు, పూలు, పండ్లు పార్ట్‌టైమ్ అమ్మకాలు చేస్తుంటారు. స్థానికులతోపాటు సమీపగ్రామాల్నుంచి వీరంతా పట్టణానికి వచ్చి ఉపాధిని పొందుతుంటారు. ఎండలో ఎండుతూ వర్షాలకు తడుస్తూనే వ్యాపారాలు చేస్తుంటారు. వర్షాలు బాగా కురిసే రోజుల్లో ఏరోజైనా కాసేపు తెరిపివ్వకపోతే ఆ రోజుకు నాలుగు రూపాయలు కళ్లచూసే అవకాశాన్ని కోల్పోతారు.
ఏకంగా రూ.10 నుంచి రూ.30కు పెంపుదల రోజూ రూ.30 చెల్లించలేమంటున్న చిన్నవ్యాపారులు తెనాలిలో స్ట్రీట్‌వెండర్లు, హాకర్లు రెండు వేలకు పైమాటే!
ఆశీలుపై ఆవేదన
ఇలా అవస్థలు పడుతూ వ్యాపారాలు చేస్తూ పొట్టపోసుకునే చిరువ్యాపారులు కూడా చాలామందికి ఆదాయ వనరులయ్యారు. తమ దుకాణం లేదా ఇంటి ముందు రోడ్డుపై వ్యాపారం చేసుకునే చిరువ్యాపారుల నుంచి రోజుకింతని యజమానులు వసూలు చేసుకుంటూ ఉంటారు. అదేమని అడిగితే ఆ మాత్రం చోటు కూడా ఇవ్వరని, వారు అడిగిన మొత్తం ఇచ్చేస్తుంటారు. ఇలాంటి వారినుంచి రోజుకు రూ.100 వరకు తేరగా వసూలుచేసే యజమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో పట్టణ మున్సిపాలిటీ ఒక్కో చిరువ్యాపారి నుంచి రోజుకు రూ.30 చొప్పున వసూలు చేస్తోంది. ఇంతకుముందు రూ.10 చొప్పున వసూలు చేసే ఆశీలు ఇప్పుడే ఏకంగా రూ.30 వరకు పెంచింది. మార్కెట్ షాపులను వేలంపాట నిర్వహించిన తర్వాత వేలం పాడుకున్న వ్యాపారి, చిన్నచిన్న వ్యాపారుల నుంచి కూడా రోజుకు రూ.30 వసూలు చేస్తున్నారు. ఇది తమకు భారంగా పరిణమించిందని వ్యాపారులంతా ఆవేదన పడుతున్నారు. ఆశీలు భారం తగ్గించాలని కోరుతున్నారు.


