
భళా.. రామకృష్ణ విద్యా తృష్ణ
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ గాజుల రామకృష్ణ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. సోమవారం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసిన పీజీ సూపర్ స్పెషాలిటీ పరీక్ష ఫలితాల్లో ఆయన ఉత్తీర్ణత సాధించారు. కార్డియాలజీలో పీజీ పూర్తి చేసి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నాలుగు పీజీ వైద్య విద్యలు జనరల్ మెడిసిన్, పల్మనరీ మెడిసిన్, న్యూరాలజీ, కార్డియాలజీ అభ్యసించారు. ఇన్‌ఫెక్షన్ డిసీజెస్, డయాబెటాలజీలో డిప్లొమో కోర్సులు పూర్తి చేశారు.
చావలి వాస్తవ్యులు
గుంటూరు జిల్లా వేమూరు మండలం చావలికి చెందిన గాజుల వీరశేఖరరావు, లీలావతి దంపతుల కుమారుడు రామకృష్ణ గుంటూరు ఎల్‌ఈఎం స్కూల్‌లో 7వ తరగతి వరకు చదివారు. బాలకుటీర్ స్కూల్‌లో 8 నుంచి 10వ తరగతి వరకు, గుంటూరు జేకేజీ కళాశాలలో ఇంటర్ అభ్యసించారు. గుంటూరు వైద్య కళాశాలలో 1986 – 92లో ఎంబీబీఎస్, 1998– 2000లో పల్మనాలజీలో పీజీ చేశారు. 2001 నుంచి 2004 వరకు వెల్దుర్తి మండలం ఉప్పలపాడు పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించారు. 2004 నుంచి 2006 వరకు ప్రభుత్వ జ్వరాల ఆసుపత్రిలో ట్యూటర్‌గా పని చేశారు. 2006 నుంచి 2009 వరకు జనరల్ మెడిసిన్‌లో గుంటూరులో పీజీ అభ్యసించారు. 2009 నుంచి 2011 వరకు గుంటూరు జీజీహెచ్‌లో జనరల్ మెడిసిన్ వైద్య విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. 2011 నుంచి 2014 వరకు తిరుపతి సిమ్స్‌లో న్యూరాలజీలో పీజీ వైద్య విద్యను అభ్యసించారు. 2014 నుంచి నేటి వరకు గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తూ 2022లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందారు. పీజీ నీట్ ఎంట్రన్స్‌లో ర్యాంకు సాధించి కార్డియాలజీ సూపర్‌స్పెషాలిటీ పీజీలో మంగళగిరి ఎన్నారైలో చేరారు. నేడు విజయవంతంగా కార్డియాలజీ పీజీ కోర్సు పూర్తి చేసుకుని, నాలుగు పీజీలు చదివిన ఏకై క వైద్యుడిగా అరుదైన రికార్డు డాక్టర్ రామకృష్ణ సొంతం చేసుకున్నారు.
క్రీడల్లోనూ ప్రతిభ
తిరుపతిలో పీజీ వైద్య విద్యార్థిగా ఉన్న సమయంలో డాక్టర్ గాజుల రామకృష్ణ 86 స్పోర్ట్స్ మెడల్స్ దక్కించుకున్నారు. 33 న్యూరాలజీ క్విజ్ పోటీల్లో విజేతగా నిలిచి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. 2014లో నేషనల్ క్విజ్ పోటీలో విన్నర్‌గా నిలిచారు.