● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ధ్వజ
పట్నంబజారు: కూటమి సర్కార్ దగా ప్రభుత్వమని, ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్ధాలకోరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు విమర్శించారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం కొట్టుమిట్టాడుతోందని ధ్వజమెత్తారు. జేకేసీ కళాశాల రోడ్డులోని ఒక ప్రైవేట్ హోటల్‌లో సోమవారం వైఎస్సార్ సీపీ 3వ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. పలు అంతర్గత అంశాలతో పాటు వివిధ సమస్యలపై నేతలు కూలంకషంగా చర్చించారు. పలు అంశాలను ప్రతిపాదించి, ఆమోదించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ మిర్చి రైతుల సమస్యలపై కేంద్ర మంత్రితో మాట్లాడానని, రూ. 11,801 గిట్టుబాటు ధర కల్పిస్తామని అసెంబ్లీ సాక్షిగా, పలు సమావేశాల్లో చెప్పిన చంద్రబాబు ఒక్క టిక్కీ కూడా కొనలేదని మండిపడ్డారు. గుంటూరులో శంకర్ విలాస్ వద్ద ఆర్వోబీ నిర్మా ణాన్ని రూ. 98 కోట్లతో చేపట్టడం వల్ల ప్రజలకు మంచి కంటే చెడు అధికంగా జరిగే అవకాశం ఉందని, దీనిపై పునరాలోచించాలని ప్రభుత్వానికి అంబటి సూచించారు. 2104–19 మధ్యలోనే రూ. 167 కోట్లతో ఐకాన్ బ్రిడ్జి ప్రపోజల్ చేసిన టీడీపీ నేతలు, ఇప్పుడు రూ. 98 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం ఎలా పూర్తవుతుందో చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పు డున్న పరిస్థితుల్లో రూ. 300 కోట్లుతో నిర్మించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
● వైఎస్సార్ సీపీ గుంటూరు, పల్నాడు జిల్లాల పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఆర్వోబీ నిర్మాణం అంశంలో ఒక అడ్వైజరీ కమిటీ వేసి చర్చించాలని సూచించారు. కేవలం ముగ్గురు, నలుగురు కలిసి తీసుకునే నిర్ణయం కాదన్న విషయాన్ని కూటమి నేతలు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. కేంద్ర మంత్రి పెమ్మసానికి గుంటూరుతో అసలు సంబంధం లేదని, ఆయనకు ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, ప్రజల బాధలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, పార్టీ నగర అధ్యక్షులురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, తెనాలి మాజీ ఎమ్మెల్యే, సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్, పార్టీ నేతలు నిమ్మకాయల రాజనారాయణ, మెట్టు వెంకటప్పారెడ్డి, మండేపూడి పురుషోత్తం, ఈమని రాఘవరెడ్డి, సీడీ భగవాన్, కొత్తా చిన్నపరెడ్డి, శేషగిరి పవన్, కొరిటిపాటి ప్రేమ్‌కుమార్, మామిడి రాము, విజయ్, నందేటి రాజేష్ పాల్గొన్నారు.


