కిశోర బాలికల సమగ్రాభివృద్ధికి పటిష్ట చర్యలు
మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ జేడీ శిరీష
గుంటూరు ఎడ్యుకేషన్: కిశోర బాలికల సమగ్రాభివృద్ధికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం. శిరీష పేర్కొన్నారు. వేసవి సెలవుల్లో కిశోర బాలికల కోసం నిర్వహించాల్సిన కార్యక్రమాలపై రూపొందించిన ప్రత్యేక కేలండర్‌పై సోమవారం జెడ్పీ సమావేశ మందిరంలో గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల పరిధిలోని వివిధ శాఖ అధికారులు, సిబ్బందికి ప్రాంతీయ వర్క్‌షాప్ నిర్వహించారు. యూనిసెఫ్ సహకారంతో నిర్వహించిన వర్క్‌షాప్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న శిరీష బాల్య వివాహాలు, రుతుక్రమ పరిశుభ్రత, బాలల హక్కులు, పోషణ–ఆరోగ్యం, లింగ సమానత్వం, విద్య ఆవశ్యకత, నైపుణ్యాభివృద్ధి–ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కిశోర వికాసంపై గ్రామస్థాయిలో నిర్వహించాల్సిన కార్యక్రమాల ప్రణాళికపై చర్చించారు. జిల్లాల వారీగా రూపొందించిన కార్యాచరణకు అనుగుణంగా పని చేయాలని ఆమె సిబ్బందికి సూచించారు. వర్క్‌షాప్‌లో జాయింట్ డైరెక్టర్ బి. మనోరంజని, ప్రాంతీయ డెప్యూటీ డైరెక్టర్ ఎస్. జయలక్ష్మి, జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ సాధికారిత అధికారి కేవీఏఎస్ విజయలక్ష్మి, డీఎంహెచ్‌వో డాక్టర్ విజయలక్ష్మి, ప్రోగ్రాం మేనేజర్ కె. కమల్‌కుమార్, నాగమల్లేశ్వరి, సీడీపీవోలు, నోడల్ అధికారులు పాల్గొన్నారు.


