
4న శ్రీవాసవీ దేవస్థానం కమిటీ సర్వసభ్య సమావేశం
తెనాలి: శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ సర్వసభ్య సమావేశం మే నెల 4వ తేదీన నిర్వహించనున్నారు. ఈ మేరకు పాలకవర్గ బాధ్యులు మంగళవారం దేవస్థానం ప్రాంగణంలో విలేకరుల సమావేశంలో తెలిపారు. కమిటీ ఉపాధ్యక్షుడు ఆకి అచ్యుతరావు, వుప్పల వరదరాజులు, దేసు శ్రీనివాసరావులు మాట్లాడారు. ముందుగా ఏప్రిల్ 13వ తేదీన సర్వసభ్య సమావేశం జరిపేందుకు నిర్ణయించి, ఆ ప్రకారం వెయ్యిమంది సభ్యులకు నోటీసులు పంపినట్టు గుర్తుచేశారు. దేవస్థానం కమిటీ జనరల్ బాడీలో సభ్యులు కానివారు, అన్య కులస్తులు వచ్చి గందరగోళ పరిస్థితులు సృష్టించిన కారణంగా సమావేశాన్ని వాయిదా వేసినట్టు తెలిపారు. మళ్లీ సర్వసభ్య సమావేశం జరపాలంటే కార్యవర్గం సమావేశమై, తేదీని నిర్ణయించి వెయ్యిమంది సభ్యులకు నోటీసుల ద్వారా తెలియపరచాల్సి ఉందన్నారు. నిర్ణయించిన తేదీన సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి, అక్కడ తీసుకునే నిర్ణయం అమలవుతుందని చెప్పారు. ఎవరుపడితే వాళ్లొచ్చి, ఏవేవో పుస్తకాలు పెట్టుకుని సభ్యులు కానివారితో సహా సంతకాలు పెట్టించుకుని తామే కమిటీగా ఎన్నికయ్యాం అంటే చెల్లుబాటు కాదన్నారు. ఈ నెల 13న రసాభాసతో సమావేశం వాయిదా పడిన తర్వాత ట్రైనీ అడిషనల్ ఎస్పీ సుప్రజ వచ్చి బైలా తీసుకెళ్లినట్టు గుర్తుచేశారు. 15 రోజుల సమయం తీసుకుని సమావేశం జరుపుదామని చెప్పినట్టే, వైశ్య కులదేవత శ్రీవాసవీ అమ్మవారి సాక్షిగా మే నెల 4వ తేదీన సర్వసభ్య సమావేశం జరుగుతుందని తెలిపారు. సభ్యులంతా హాజరై తగిన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామని చెప్పారు. అంతా ఆ నిర్ణయానికే కట్టుబడి ఉండాలన్నారు. సభ్యులకు నోటీసులు పంపుతున్నామని, ఆధార్ కార్డు, సమావేశం నోటీసు, ఐడీ కార్డు సహా సభ్యులు సమావేశానికి హాజరుకావాలని సూచించారు. పోలీసు బందోబస్తుతో సభ్యులనే లోనికి అనుమతిస్తారని తెలిపారు. వక్కలగడ్డ గంగాధర్, అన్నవరపు నరసింహారావు, గ్రంధి విశ్వేశ్వరరావు, మాలేపాటి హరిప్రసాద్, మద్దాళి శేషాచలం, గొడవర్తి సాయి హరేరామ్, సుగ్గుల మల్లికార్జునరావు, నూకల భాస్కరరావు, కొల్లా గురునాథగుప్తా తదితరులు పాల్గొన్నారు.