
నేటి నుంచి టీచర్ల సర్టిఫికెట్ల పరిశీలన
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్‌లో సాధారణ బదిలీల కోసం పెట్టుకునే ప్రభుత్వ టీచర్ల సర్టిఫికెట్ల పరిశీలన ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు మూడు రోజులపాటు జరుగుతుందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు సాధారణ బదిలీ కోసం వైద్య పరీక్షలు చేయించుకునేందుకు ప్రతి ఒక్కరూ జీజీహెచ్ ఆసుపత్రి అభివృద్ధి సంఘం కౌంటర్‌లో రూ.1,500 ఫీజు చెల్లించాలన్నారు. అభ్యర్థులు రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, ఉద్యోగ గుర్తింపు కార్డు తీసుకుని ఉదయం 9 నుంచి 12 గంటల మధ్యలో కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 99637 66638 ఫోన్ నంబరులో సంప్రదించాలన్నారు.
ఘనంగా పోలేరమ్మ
ఆలయ వార్షికోత్సవం
తెనాలి టౌన్: భక్తుల కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీర్చే పోలేరమ్మ కరుణ, కటాక్షాలు ప్రజలందరిపై మెండుగా ఉండాలని ఆలయ ధర్మకర్త వీరయ్య ఆకాంక్షించారు. పట్టణ వైకుంఠపురం రోడ్డులో వేంచేసియున్న పోలేరమ్మ దేవస్థానం 27వ వార్షికోత్సవాలు మంగళ, బుధవారాలు కనులపండువగా నిర్వహించారు. పసుపు, కుంకుమలతో మేళ తాళాలు, కనక తప్పెట్లు, కాళికా వేషధారణలతో పురవీధుల్లో ఉరేగింపు ఉత్సవం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. బుధవారం దేవస్థానం వద్ద భక్తులకు అన్న వితరణ చేశారు. విశేష సంఖ్యలో పట్టణ, పరిసర ప్రాంత ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమంలో గుంటి వెంకట్, పెద్దలు పాల్గొన్నారు.
సూదివారిపాలెం సర్పంచ్‌కు పంచాయతీ రాజ్ అవార్డు
ఇంకొల్లు(చినగంజాం): జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా మండలంలోని సూదివారిపాలెం గ్రామ సర్పంచ్ గోరంట్ల జయలక్ష్మికి కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో అవార్డు ప్రదానం చేశారు. ఢిల్లీలో మంగళవారం నిర్వహించిన పంచాయతీ రాజ్ దివస్ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి వనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్ చేతుల మీదుగా ఆమె అవార్డును అందుకున్నారు. రాష్ట్ర స్థాయిలో ఆదర్శ గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేస్తున్న రాష్ట్రీయ గౌరవ గ్రామ సభ అవార్డుతో ఆమెను సత్కరించారు.
వీరయ్య చౌదరి హత్య కేసులో రేషన్ మాఫియా?
● పోలీసుల అదుపులో వెదుళ్లపల్లి రైస్‌మిల్లు యజమాని
● ఆరా తీస్తున్న పోలీసులు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి హత్య కేసులో రేషన్ మాఫియా పాత్రపై పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. హత్య కేసును విచారిస్తున్న పోలీసులకు రేషన్ మాఫియాపై అనుమానాలు తలెత్తినట్లు సమాచారం. నాగులుప్పలపాడుకు చెందిన చౌక బియ్యం వ్యాపారితో వీరయ్య చౌదరికి విభేదాలున్నాయి. ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనితో కలిసి వ్యాపారం చేసిన పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా బాపట్ల నియోజకవర్గంలోని వెదుళ్లపల్లికి చెందిన రైస్‌మిల్లు యజమానిని కూడా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. వీరయ్య చౌదరి హత్యలో నిజంగా రేషన్ మాఫియా హస్తం ఉందా? లేక మరేదన్నా కారణమా? అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.
పోలీసుల అదుపులో ముగ్గురు..?
పొన్నూరు: పట్టణంలోని నిడుబ్రోలుకు చెందిన గోపి, అమీర్, అశోక్ అనే ముగ్గురిని ఒంగోలు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రకాశం జిల్లాలో జరిగిన టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో వీరి పాత్రపై అనుమానంతో తీసుకువెళ్లినట్లు తెలిసింది. ఈ ముగ్గురు వెదుళ్లపల్లి మిల్లుకు రేషన్ బియ్యం రవాణా చేస్తున్నట్లు, ఈ క్రమంలో వీరి ప్రమేయంపై అనుమానంతో అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది.