చెమటోడుస్తున్నా చల్లనమేదీ? | - | Sakshi
Sakshi News home page

చెమటోడుస్తున్నా చల్లనమేదీ?

Apr 24 2025 1:30 AM | Updated on Apr 24 2025 1:30 AM

చెమటోడుస్తున్నా చల్లనమేదీ?

చెమటోడుస్తున్నా చల్లనమేదీ?

గుంటూరు జీజీహెచ్‌లో గుండె జబ్బు రోగులకు అవస్థలు తప్పడం లేదు. దీర్ఘకాలిక వ్యాధితో రోజూ ఇబ్బంది పడేవారు కొంత ఉపశమనం కోసం గుంటూరు జీజీహెచ్‌కు వస్తే అక్కడ ఏసీలు పనిచేయక మరిన్ని కష్టాలు పడుతున్నారు. ఒక పక్క ఎండలు మండిపోతున్నాయి. మరోపక్క ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గదిలో ఏసీలు పనిచేయక నానా అగచాట్లు పడుతున్నారు. రోగులకు సరిపడా గాలి, వెలుతురు లేని పక్షంలో ఊపిరి అందక ఒక్కోసారి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. వారికి సేవలు అందించే వైద్యులకూ ఇబ్బందులు తప్పడం లేదు. అయినప్పటికీ ఆసుపత్రి అధికారులు తీవ్ర నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు.

గుంటూరు మెడికల్‌ : గుంటూరు జీజీహెచ్‌ గుండె జబ్బుల విభాగం సీసీయూలో చికిత్స కోసం వచ్చే రోగులు రెండు నెలలుగా ఏసీలు పనిచేయక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కొద్దో గొప్పో డబ్బులు ఉన్నవారు ఫ్యాన్లు కొనుగోలు చేసుకుని తమ పడకల వద్ద పెట్టుకుంటున్నారు. కొంత మంది ఇళ్ల వద్ద నుంచి తెచ్చుకుంటున్నారు. స్థోమత లేని వారు మాత్రం గాలిక ఆడక, నిద్రపట్టక నానా అగచాట్లు పడుతున్నారు. వేసవికి ముందే ఆసుపత్రిలో ఏసీల నిర్వహణ చూడాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం వల్లే నేడు రోగులకు ఇబ్బంది తప్పడం లేదని పలువురు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏసీల మెయింటెనెన్స్‌ కాంట్రాక్టును విజయవాడకు చెందిన కంపెనీ వారు దక్కించుకున్నారు. మార్చి ప్రారంభానికి ముందే మరమ్మతులు చేయాల్సి ఉంది. ఐసీయూ, క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌, ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లాంటి అత్యవసర వైద్య సేవల విభాగాల్లో నిత్యం ఏసీల వినియోగం తప్పనిసరిగా ఉంటుంది. వాటి నిర్వహణ సక్రమంగా ఉండటం లేదు. సదరు కాంట్రాక్టర్‌పై ఆసుపత్రి అధికారులు చర్యలు తీసుకోకుండా చోద్యం చూడడం విమర్శలకు తావిస్తోంది. రోగులు ఇబ్బంది పడుతున్నప్పుడైనా కాంట్రాక్టర్‌కు బిల్లులు నిలుపుదల చేయడం, లేదా వేరొకరికి కాంట్రాక్టు అప్పగించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఆసుపత్రి అధికారులకు సంబంధించిన గదుల్లో మాత్రం ఏసీలు బాగానే పనిచేస్తున్నాయి.

వైద్యులు, వైద్య సిబ్బందికీ కష్టాలు

హార్ట్‌ ఫెయిల్యూర్‌ లాంటి తీవ్ర ప్రాణాపాయ స్థితిలో గుంటూరు జీజీహెచ్‌ గుండె జబ్బుల వార్డుకు వస్తున్న రోగులకు చికిత్స అందించేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది చెమటోడ్చి సేవలందిస్తున్నారు. ఎక్కువ సేపు వైద్య విభాగంలో సేవలందించేలా ఆసుపత్రి అధికారులు ఏసీలు రిపేర్లు చేయించకపోవడంతో వీరు సైతం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అధిక సంఖ్యలో గుండె ఆపరేషన్లు చేస్తూ రికార్డులు సృష్టిస్తున్నా తగిన వసతులు కల్పించకపోవడం అధికారుల నిర్లక్ష్య ధోరణికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మే నెలలో ఎండ తీవ్రత పెరిగి మరిన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇకనైనా ఆసుపత్రి అధికారులు స్పందించి పేద రోగులతోపాటు వైద్య సిబ్బంది బాధలు తీర్చాలని పలువురు కోరుతున్నారు.

సమస్య పరిష్కారానికి ఆదేశాలిచ్చాం

కార్డియాలజీ సీసీయూ విభాగంలో ఏసీలు పనిచేయని విషయంపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ యశస్వి రమణను ‘సాక్షి’ వివరణ కోరగా... సమస్య తమ దృష్టికి వచ్చిందన్నారు. సెంట్రల్‌ ఏసీ అవడంతో తరచుగా సమస్య ఉత్పన్నం అవుతోందని తెలిపారు. ఏసీలు పనిచేసేలా చూడాలని కాంట్రాక్టర్‌కు ఆదేశాలు ఇచ్చామన్నారు.

జీజీహెచ్‌ గుండె జబ్బుల

విభాగంలో పనిచేయని ఏసీలు

వైద్యం చేసే సమయంలో డాక్టర్లకు

తప్పని అవస్థలు

సొంత ఫ్యాన్లు తెచ్చుకుంటున్న

రోగులు, సహాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement